కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా తాము రూపొందించిన టీకా అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు సంస్థ ఇప్పటికే వెల్లడించింది. దీంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర అనుమతి కోసం అప్లై చేయగా చైనా, రష్యా దేశాల వ్యాక్సిన్‌లు మినహా ఎమర్జన్సీ యూసేజ్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండో వ్యాక్సిన్‌గా మోడెర్నా టీకా నిలిచింది.
మోడెర్నా తయారుచేసిన కరోనా టీకా 94శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఐతే తొలి మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో భాగంగా కేవలం 95కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం 196కేసులను విశ్లేషించిన తర్వాత వ్యాక్సిన్ సమర్థతను మరోసారి ప్రకటించింది. సేఫ్టీపై పూర్తి నమ్మకంతో ఉన్న మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో స్వల్ప పరిణామాలు మాత్రమే కనిపించినట్లు స్పష్టంచేసింది.