ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన.. మోడీ మధ్యవర్తిత్వం వహిస్తే...
Ukraine - Narendra Modi: యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై మోడీ ఆయనతో మాట్లాడాలి...
Ukraine - Narendra Modi: ప్రధానమంత్రి మోడీ మధ్యవర్తి పాత్ర పోషించడానికి ఇష్టపడితే... స్వాగతిస్తామంటోంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఇందుకు సంబంధించి ఒక సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ఎప్పుడు వాస్తవ చరిత్రకు సాక్షిగా ఉంటుందని... యుద్ధాన్ని ఉక్రెయిన్ కోరుకోవడం లేదని... అయితే దేశాన్ని రక్షించుకోవడం ఎలాగో తెలుసునన్నారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యవర్తి పాత్రను తీసుకుంటే స్వాగతిస్తామన్నారు. రష్యాను ఇన్‌ఫ్లుయన్స్ చేసి శక్తి భారతదేశానికి ఉందని తాము నమ్ముతున్నామన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని రష్యాను పదేపదే కోరుతున్నామన్నారు ఉక్రెయిన్ మంత్రి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ... రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మధ్యవర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరుకుంటారా అని ప్రశ్నించగా... వెల్కమ్ చెబుతానన్నారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి. భారత ఉత్పత్తులకు ఉక్రెయిన్ నమ్మకమైన కష్టమరన్నారు కులేబా. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య వర్తకం సాగుతోందని... ఇండియా అవసరాలను ఉక్రెయిన్ తీర్చుతుంటే... ఉక్రెయిన్ అవసరాలను ఇండియా తీర్చుతుందన్నారు. భారత ఆహార భద్రతకు హామీ ఇచ్చేవారిలో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుందన్నారు. సన్ ఫ్లవర్ ఆయిల్, కొన్ని ధాన్యాలను ఇండియా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు మంత్రి కులేబా. వాణిజ్యం ఉభయదేశాలకు మేలుకరమన్నారు.
రష్యాతో భారత్‌కు ఉన్న సన్నిహత సంబంధాలను వినియోగించుకొని... యుద్ధాన్ని ఆపేలా... చేయాలని ఇండియాకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఉక్రెయిన్ మంత్రి. రష్యాలో నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి అధ్యక్షుడు పుతిన్ మాత్రమేనని... యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై ఆయనతో ఇండియా నేరుగా మాట్లాడాలన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా. భూమండలంపై యుద్ధకాంక్ష ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క పుతిన్ మాత్రమేనని దుయ్యబట్టారు. రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్ పౌరులంతా అదే పని చేస్తున్నారన్నారు.
ఈ యుద్ధంలో ఇండియా, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలన్నారు. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు త్వరలోనే సహకరిస్తాయన్నారు. తిరిగి విద్యార్థులు ఉక్రెయిన్ వచ్చి చదువుకోవాలన్నారు. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయన్నారు. రష్యాతో చర్చలు ఫలప్రదమవ్వాలని కోరుకుంటున్నామని... ఒక్కో ఇష్యూపై రష్యాతో చర్చిస్తున్నామని... అయితే డీల్ కుదరడమన్నది చాలా పెద్ద అంశమన్నారు.