కరోనా మహమ్మారి గురించి చైనాకు గతేడాది నవంబర్ ప్రారంభంలోనే తెలుసునని కానీ, ఆ వివరాలను ప్రపంచానికి వెల్లడించలేదని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. దీనివల్లే ప్రపంచ దేశాలన్నీ కరోనా ప్రమాదాన్ని గుర్తించడంలో వెనుకబడ్డాయన్నారు. చైనా వైఖరి ఎంతమాత్రం బాగాలేదని, భవిష్యత్తులో ఆ దేశం తగిన మూల్యం చెల్లించక తప్పదని మైక్ పాంపియో హెచ్చరించారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఇక ముందు ఇలాంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుండా అమెరికా చూసుకుంటుందని ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వుహాన్ నుంచే వైరస్ పుట్టిందన్నది ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తామని అన్నారు. " అమెరికాలో కరోనా మరణాలు, ఆర్థిక సంక్షోభానికి కారణమైన వారు తప్పక మూల్యం చెల్లిస్తారు. వారు పారదర్శకంగా జవాబుదారీగా ఉండాలి " అని పాంపియో అన్నారు.