Marburg Virus: ప్రపంచాన్ని భయపెడుతున్న డేంజర్ వైరస్
Marburg Virus: పశ్చిమాఫ్రికాలోని గినియాలో మార్‌బర్గ్ వైరస్ * గబ్బిలాల నుంచి మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి
Marburg Virus: కోవిడ్ నుంచి కోలుకోక ముందే మరో డేంజర్ వైరస్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. కరోనా సోకితే మాక్సిమం ప్రాణాలతో బయటపడొచ్చు.. కానీ ఈ వైరస్ అంతకుమించి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపడమే కాదు.. ఏకంగా రక్తనాళాలు చిట్లిపోయి మరణిస్తారని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధే హెచ్చరిస్తోంది. ఇంతకూ ఏంటా వైరస్..? ఎక్కడ, ఎలా పుట్టింది.?
మార్‌బర్గ్.. ప్రస్తుతం పశ్చిమాఫ్రికాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వైరస్ ఇది. గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే ఈ మహమ్మారిని పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో గేక్కేడౌలో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మార్‌బర్గ్ వైరస్‌తో ఓ వ్యక్తి ఆగస్టు2న చనిపోయారు. ఈ వైరస్ సోకినప్పడు వచ్చే జ్వరంతో రక్తనాళాలు చిట్లిపోతాయి. ఇది కూడా ఎబోలా వైరస్ జాతికి చెందినదే కావడం గమనార్హం. గినియాలో ఎబోలాను కట్టడి చేసేందుకు ఆరునెలలపాటు తీవ్రంగా శ్రమించారు. దానినుంచి గత రెండు నెలలుగా ముప్పు తప్పిందనుకుంటున్న తరుణంలో అదే జాతికి చెందిన మరో వైరస్ బయటపడినట్లు WHO పేర్కొంది.
మరోవైపు.. ఇదే ఏడాది గినియాలోని గేక్కేడౌలోనే ఎబోలా వైరస్ బయటపడింది. అలాగే 2014-16 మధ్య కాలంలోనూ పశ్చిమాఫ్రికాలోని ఇదే ప్రాంతంలో ఎబోలా వ్యాపించిందని యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. కరోనాతో మరణాలు 1నుంచి 5 శాతం లోపలే ఉంటే, ఈ కొత్త వైరస్‌తో చాలామంది మరణించే ప్రమాదం ఉండటం, ఇది కూడా కొవిడ్‌లాగే రోగితో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి, రోగి స్రావాలను, అతను తాకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం ద్వారా వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది.