Worlds Best Cities 2025: ప్రపంచంలోని ఉత్తమ నగరాలివే... ఢిల్లీ, ముంబై ర్యాంక్ ఎంత ?
Worlds Best Cities 2025 List: నంబర్ 1 – లండన్, నంబర్ టూ – న్యూయార్క్, నంబర్ త్రీ – పారిస్.... రెసోనన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఇప్సోస్‌తో కలిసి నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ సిటీస్ సర్వే 2025’లో టాప్-త్రీ సిటీస్ ఇవే.
Worlds Best Cities 2025 List: నంబర్ 1 – లండన్, నంబర్ టూ – న్యూయార్క్, నంబర్ త్రీ – పారిస్.... రెసోనన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఇప్సోస్‌తో కలిసి నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ సిటీస్ సర్వే 2025’లో టాప్-త్రీ సిటీస్ ఇవే. ప్రపంచంలోని అత్యుత్తమ నగరంగా లండన్ వరసగా పదో ఏడు కూడా టాప్ పొజిషన్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏ నగరంలో జీవించాలనుకుంటున్నారు? ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారు? ఏ నగరంలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారనే అంశాల ప్రాతిపదికన ఈ టాప్ సిటీస్ జాబితాను రూపొందిస్తారు. ఈ సర్వే కోసం రెసోనన్స్ టీమ్ 31 దేశాల్లోని 22,000 మందిని సర్వే చేసింది.
మరి ఈ జాబితాలో భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఏమైనా చోటు దక్కిందా? లేదు. ఈ నగరాలకు అసలు టాప్-100లో కూడా చోటు దక్కలేదని రెసోనన్స్ కన్సల్టెన్సీ సీఈఓ క్రిస్ ఫెయిర్ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దిల్లీ, ముంబయి నగరాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. కానీ, గ్లోబల్ స్కేల్ ప్రకారం చూస్తే ఇవి టాప్ హండ్రెడ్‌లోకి కూడా రాలేకపోయాయని క్రిస్ అన్నారు. ముంబయి, దిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు వాటివైన ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ, ఆ నగరాల్లో మానవ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయనే కోణంలో చూసినప్పుడు అవి చాలా వెనుకబడ్డాయి. అయితే, ఫిబ్రవరి నెలలో విడుదలైన ఆసియా-పసిఫిక్ రిపోర్టులో మాత్రం దిల్లీ, ముంబయి నగరాలు టాప్-20లో చోటు దక్కించుకున్నాయి.
సహజమైన, మానవ నిర్మిత సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాటి వల్ల జీవనం ఎలా ఉందన్నది... అంటే లివబిలిటీ ఎలా ఉందన్నది ఈ సర్వేలో ప్రధానంగా విశ్లేషించారు. అలాగే, లవబులిటీ అంటే నగరాన్ని ప్రేమించేందుకు కావలసిన సహజమైన ప్రకృతి సౌందర్యం, నైట్ లైఫ్, డైనింగ్ వంటి అంశాలను కూడా ర్యాంకింగ్స్‌కు ప్రాతిపదికగా తీసుకున్నారు.
ఈ సర్వే ప్రకారం ఒక గ్రేట్ సిటీకి ఉండాల్సిన లక్షణాలన్నీ లండన్ నగరానికి ఉన్నాయి. ఐకానిక్ అట్రాక్షన్స్, ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు తోడు విభిన్న జాతుల సంగమంగా ఈ నగరం విస్తరిస్తోందని, అదే ఈ నగరాన్ని ముందు వరసలో నిలబెట్టిందని ఈ సర్వే తెలిపింది. లండన్ తరువాత స్థానాల్లో వరసగా న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నగరాలున్నాయి. ఈ టాప్ 10 సిటీస్ సంగతి అలా ఉంటే, టాప్-హండ్రెస్ సిటీస్‌లోని 36 నగరాలు అమెరికాలోనే ఉన్నాయి.