Big Breaking News: బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా

Liz Truss Resign: బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ గురువారం రాజీనామా చేశారు

Update: 2022-10-20 13:23 GMT

Liz Truss Resign: బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ గురువారం రాజీనామా చేశారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. కేవలం 45 రోజుల పాటే బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఉన్నారు. బ్రిటన్‌ ప్రధానిగా ఆమె తీసుకున్న పలు ఆర్థిక కార్యక్రమాలు అక్కడి మార్కెట్లను భారీ కుదుపులకు గురిచేయడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా పెట్టుబడులు రాకుండా పోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రోజు క్రితం ఆమె క్యాబినెట్‌లోని హోం మంత్రి రాజీనామా చేయగా పది రోజుల క్రితం ఆర్థిక మంత్రిని పదవి నుంచి తప్పించారు. ఒకదాని వెంట ఒకటిగా లిజ్‌ ట్రస్‌కు షాక్‌లు తగులుతున్నాయి.

గురువారం నంబర్‌ 10 డౌనింగ్ స్ట్రీట్‌ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ట్రస్‌ మాట్లాడుతూ తనపై పార్టీ విశ్వాసాన్ని కోల్పోయిందని, తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయానని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. దాంతో బ్రిటన్‌ రాజుతో సంప్రదించిన మీదట ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.

వారం రోజులుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఎట్టకేలకు గురువారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 6 వారాల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగారు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు తనను ప్రధానిగా నియమించిన కన్జర్వేటీవ్‌ పార్టీ నాయకత్వానికి లేఖ ద్వారా సమాచారమిచ్చారు. తాను తీసుకొచ్చిన ఆర్థిక కార్యక్రమాలు మార్కెట్లను అతలాకుతలం చేసినందున బాధ్యత వహిస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.

కన్జర్వేటివ్ పార్టీ స్పెషల్ రూల్ కమిటీ, 1922 ఛైర్మన్‌గా ఉన్న సర్ గ్రాహం బ్రాడీ.. లిజ్‌ ట్రస్‌ను కలుసుకుని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ చేసిన ఆదేశాన్ని అందించారు. అంతకుముందు, బ్రిటన్ హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రవర్‌మన్ బుధవారం మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె తన క్యాబినెట్‌లోని ఆర్థిక మంత్రి క్వాసీని రాజీనామా చేయించారు.

Tags:    

Similar News