ఫైనల్ స్టేజ్‌కు బ్రిటన్ ప్రధాని ఎన్నిక ప్రక్రియ.. లిజ్ ట్రస్‌కే విజయావకాశాలు.. రిషికి నో చాన్స్!
UK Prime Minister Race: బ్రిటన్ అత్యున్నత ప్రధానమంత్రి పదవి ఎన్నిక ఫైనల్ స్టేజీకి చేరుకుంది.
UK Prime Minister Race: బ్రిటన్ అత్యున్నత ప్రధానమంత్రి పదవి ఎన్నిక ఫైనల్ స్టేజీకి చేరుకుంది. చివరి రౌండ్‌లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునాక్, విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్‌బరిలో నిలిచారు. ఇరువురు నేతలు దేశవ్యాప్తంగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం రిషి కంటే లిజ్ ట్రస్‌కే ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. పలు వివాదాల్లో చిక్కుకున్న బోరిస్ జాన్సన్ జులై 7న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రధానికి ఎన్నిక ప్రక్రియ మొదలయ్యింది. ఇందులో తొలుత 11 మంది పోటీ పడ్డారు. మొదటి నుంచి సర్వేలు మాత్రం రిషి సునాక్‌కు అంత సానుకూలంగా ఏమీ లేవు ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో అత్యధికంగా రిషికి వ్యతిరేకంగానే వచ్చాయి.
టోరీ లీడర్ ఎన్నికలో మొదట ఎంపీలు ఓటేస్తారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కో రౌండ్లో తక్కువ ఓట్లు వచ్చిన నేతలు తప్పుకుంటారు. చివరి రౌండ్‌లో మిగిలిన ఇద్దరిని మాత్రం కన్జర్వేటీవ్ పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు. వారే పార్టీకి నాయకత్వంతో పాటు ప్రధాని పదవిని దక్కించుకుంటారు. ఇప్పుడు చివరి రౌండ్‌లో కేవలం రిషి సునాక్, లిజ్ ట్రస్ మాత్రమే మిగిలారు. వారిలో ఒకరిని లక్ష 75 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు ద్వారా ఎన్నుకుంటారు. అయితే కన్జర్వేటర్లు లిజ్ ట్రస్‌వైపే మొగ్గుచూపుతున్నట్టు ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. తాజాగా 90 శాతం లిజ్ ట్రస్‌కే గెలిచే అవకాశాలు ఉన్నాయని బెట్టింగ్ ఎక్స్చేంజ్ సంస్థ స్మార్కెట్స్ అంచనా వేసింది. ప్రధాని రేసులో రిషి, ట్రస్ మిగిలిన సమయంలో రిషికి 60 శాతం, ట్రస్‌కు 40 శాతం అవకాశాలు ఉండేవని ఆ తరువాత పరిణామాలతో అంచనాలు మారినట్టు బెట్టింగ్ సంస్థ తెలిపింది.
ఇటీవల ఇరువు నేతల మధ్య జరుగుతున్న చర్చల్లో ట్రస్ ప్రసంగాలు అంచనాలను అధిగమించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసి తొలి రౌండ్లలోనే ఓడిపోయిన టామ్ తుగేంధాట్ లిజ్ ట్రస్‌కు మద్దతు పలికారు. లిజ్ ట్రస్ ప్రసంగాలు తనను ఆకట్టుకున్నట్టు తెలిపారు. స్వదేశం, విదేశాల్లోనూ బ్రిటీష్ విలువల కోసం ప్రధాన్యమిచ్చినట్టు తెలిపారు. ఆమె నాయకత్వంలో దేశం మరింత సురక్షితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రకటించారు. తుగేంధాట్‌తో పాటు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బోరిస్ జాన్సన్ సైతం రిషిపై ఆగ్రహంగా ఉన్నారు. రిషికి ఓటేయొద్దని ట్రస్‌నే ఎన్నుకోవాలంటూ తన అనుచరులకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ప్రధాని పదవి నుంచి దిగిపోవడంతో పాటు పార్టీ నేతల్లోనూ తీవ్ర అవమానానికి గురైనట్టు జాన్సన్ భావిస్తున్నారు. తొలుత రాజీనామా చేసి తన పదవి పోవడానికి కారణమైన రిషిపై జాన్సన్ పగతో రగిలిపోతున్నట్టు ప్రచారమవుతోంది.
ఇదిలా ఉంటే ప్రధాని, టోరీ లీడర్ పదవులకు పోటీ మొదలైన నాటి నుంచి రిషి సునాక్‌కు ఒకటి, రెండ్రు సర్వేలు మాత్రమే అనుకూలంగా వచ్చాయి. ప్రతి రౌండ్‌లోనూ రిషికి వచ్చిన ఓట్లు పెద్ద లెక్క కాదంటూ అక్కడి సర్వేలు తేల్చాయి. అయితే చివరి రౌండ్ వరకు రిషి మాత్రం ఆధిపత్యం కొనసాగించారు. ఇప్పుడు కూడా సర్వేలు ఆయనకు ప్రతికూలంగానే వచ్చాయి. అయితే వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీని ఓడించి పార్టీని గట్టెక్కించే నేతనే కన్జర్వేటర్లు గెలిపిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీని గెలిపించే సామర్థ్యం లిజ్ ట్రస్‌కు లేదని వివరిస్తున్నారు. రిషి సునాక్‌నే కన్జర్వేటర్స్ పట్టం కడతారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే వారం నుంచి టోరీ సభ్యులకు బ్యాలెట్ పేపర్లు పంపిణీ కానున్నాయి. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రంలోగా ఓటేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 5న ఫలితాలు వెలువడనున్నాయి.