Kuwait King : కువైట్ రాజు షేక్ సబా కన్నుమూత
కువైట్ పాలకుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో..
కువైట్ పాలకుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2019 నుంచి షేక్ సబా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు.. జూలైలో మూత్రాశయ శస్త్రచికిత్స వల్ల వచ్చిన సమస్యల నేపథ్యంలో వైద్యం కోసం అమెరికా వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్కడే ప్రాణాలు విడిచారు. 1990 గల్ఫ్ యుద్ధం తరువాత ఇరాక్‌తో సన్నిహిత సంబంధాలు అలాగే ఇతర ప్రాంతీయ సంక్షోభాల పరిష్కారాల కోసం దౌత్యవేత్తగా వ్యవహరించారు.
నాలుగు దశాబ్దాలపాటు విదేశాంగ మంత్రిగా, 2006 నుండి పాలకుడిగా ఉన్నారు షేక్ సబా.. 1961 లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన ఆధునిక కువైట్ తో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్న పాలకుడిగా ఆయనకు పేరుంది. కాగా షేక్ సబా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అరబ్ ప్రపంచానికి "ప్రియమైన నాయకుడు", భారతదేశానికి "సన్నిహితుడు" మరియు "గొప్ప రాజనీతిజ్ఞుడు" అని పేర్కొంటూ నివాళులు అర్పించారు.