Kamala Harris Speech: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కమలా హారిస్ స్పందన..ఏమన్నారంటే?
Kamala Harris Speech: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం ఫలితాలపై స్పందించారు కమలా హారిస్. ఈ ఫలితాలను తాను అంగీకరిస్తున్నానని తెలిపారు. పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలపై తొలిసారిగా స్పందించిన ఆమె..వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వేచ్ఛకోసం శ్రమించాల్సి ఉంటుందని అన్నారు. అయితే దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదే అన్నారు.
ఇది నేను ఆశించిన ఫలితం కాదు. దీని కోసం మనం పోరాడలేదు. అయినా దీన్ని అంగీకరించాల్సిందే. ఎన్నికల్లో పోటీపడిన తీరుపై నాకు చాలా గర్వంగా ఉంది. దేశం పట్ల ప్రేమ, సంకల్పంతోపాటు మీరు నాపై ఉంచిన నమ్మకంతోనే నా మనస్సు నిండింది. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం పోరుబాటను ఎప్పటికీ వీడను. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు కూడా సమయం పడుతుంది. దానర్థం గెలవలేమని కాదని వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి కమల హారీస్ ప్రసంగించారు.
కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆమె వెల్లడించారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా ఆయనకు, ఆయన బృందానికి సహకరిస్తామని చేస్తామని చెప్పినట్లు తెలిపారు. అమెరికాలో అధ్యక్షుడికి లేదా పార్టీకి కాకుండా రాజ్యాంగానికి, మనస్సాక్షికి, దేవుడికి విధేయత చూపుతారన్న విషయాన్ని గుర్తు చేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదే అంటూ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు కమలా హారిస్.