US Presidential Elections: కమలా హారిస్ ప్రచారంలో ‘RRR’ నాటు నాటు పాట

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గణనీయంగా ఉన్న ఇండియన్ అమెరికన్ ఓటర్లు, దక్షిణాసియా ఓటర్లను ఆకర్షించేలా కమలా హారిస్ బృందం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Update: 2024-09-09 10:18 GMT

Kamala Harris

కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో నాటు నాటు మార్మోగుతోంది. భారత అమెరికన్ లీడర్ అజయ్ భుటోరియా నాచో నాచో పేరుతో హిందీలో రూపొందించిన ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేశారు. కమలా హారిస్ ప్రచార వీడియోలకు ఈ పాటను ఉపయోగించారు.

ఓటర్లను ఆకర్షించేలా హారిస్ బృందం ప్లాన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గణనీయంగా ఉన్న ఇండియన్ అమెరికన్ ఓటర్లు, దక్షిణాసియా ఓటర్లను ఆకర్షించేలా కమలా హారిస్ బృందం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అమెరికాలో 4.4 మిలియన్ ఇండియన్ అమెరికన్ ఓటర్లున్నారు. 6 మిలియన్ల మంది దక్షిణాసియా ఓటర్లున్నారు. ఇందులో మెజారిటీ ఓట్లు హారిస్ కు దక్కేలా ఆమె బృందం ప్లాన్ చేసింది. దక్షిణాసియా, ఆఫ్రికన్ సంతతికి చెందిన మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై హారిస్ చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్షురాలిగా హారిస్ ఎన్నికైతే ఆమె రికార్డ్ సృష్టించనట్టే.248 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్షులుగా ఇంతవరకు ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు.

ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోరు

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని తాజా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ట్రంప్ నకు 48 శాతం , హారిస్ కు 47 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారని న్యూయార్క్ టైమ్స్, సియానా పోల్ ఫలితాలు వెల్లడించాయి.

విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కమలా హారిస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవాడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఈ ఇద్దరి మధ్య 'టై' అయిందని ఈ ఫలితాలు తెలిపాయి.

తొలిసారి ట్రంప్ తో టీవీ డిబేట్ లో హారిస్

కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష రేసులో నిలిచిన తర్వాత తొలిసారిగా ఆమె ట్రంప్ తో ఏబీసీ న్యూస్ టీవీ డిబేట్ లో సెప్టెంబర్ 10న పాల్గొంటారు. గతంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బైడెన్... ట్రంప్ తో జరిగిన డిబేట్ లో తడబాటుకు గురయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకున్నారు. దీంతో హారిస్ ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

ఈ ఎన్నికలను కమలా హారిస్ సీరియస్ గా తీసుకుంది. బైడెన్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి విరాళాలు ఇచ్చే దాతలు కూడా పెరిగారు. ట్రంప్ కంటే హారిస్ కే ఎక్కువ విరాళాలు వచ్చాయి. దాతలు కూడా హారిస్ కు విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకుగాను నాటు నాటు పాటతో ప్రచార వీడియోను రూపొందించారు.


Tags:    

Similar News