ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం
* ప్రమాణ స్వీకారం రోజే కీలక నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్ * కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులతో పాటు 12 కీలక దస్త్రాలపై సంతకాలు * పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరనున్న అమెరికా * ముస్లిం దేశాలకు రాకపోకలపై ఉన్న బ్యాన్ ఎత్తివేత
అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై బైడెన్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు.
జనవరి 20న ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలు చేపట్టిన వెంటనే 12 కీలక దస్త్రాలపై బైడన్ సంతకాలు చేస్తారు. బైడన్ తీసుకోనున్న కీలక నిర్ణయాల్లో పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరడం కూడా ఉందని వైట్ హౌస్ అధికారులు వివరించారు. అలాగే, కరోనా నిబంధనలను మరింత సమర్థంగా అమలు చేయడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై ఉన్న బ్యాన్ ను ఎత్తివేయడం వంటి నిర్ణయాలను బైడెన్ తీసుకుంటారని తెలిపారు.
అమెరికాకు అక్రమంగా వలస వచ్చి ట్రంప్ నిబంధనల వల్ల పిల్లలకు దూరమైన వారి పట్ల బైడెన్ సానుకూలంగా వ్యవహరిస్తారని చెప్పారు. వారంతా తిరిగి కలుసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, అమెరికాలో విద్యా సంస్థలను తిరిగి తెరవడం వంటి అంశాలపై చర్చించనున్నారు.