Japan 4th Wave: ఫోర్త్ వేవ్..వణుకుతోన్న నగరాలు..ఒలింపిక్స్ వద్దేవద్దు
Japan 4th Wave: ఒలింపిక్స్ రద్దుచేయాలంటున్న స్థానికులు
Japan 4th Wave Covid: భారత్‌లో ఇంకా థర్డ్ వేవ్ రాలేదని, థర్డ్ వేవ్ వస్తే పరిణామాలు మరింత తీవ్రంగా, భయానకంగా ఉంటాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో జపాన్‌లో ఫోర్త్ వేవ్ విజృంభించే ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడ ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. జపాన్‌లో కరోనా తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా జపాన్ ప్రధాన నగరం ఒసాకాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఈ నగరంలో ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం వ్యాక్సినేషన్‌లో ఆ దేశం జాప్యం చేయడమేనని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసు అత్యధికంగా నమోదవుతన్నాయి. కేవలం 90 లక్షల జనాభా ఉన్న జపాన్‌లో ఈ ఒక్క వారంలో 3849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్ మరణాలు కూడా ఒసాకా నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో దాదాపు 25శాతం ఆ ఒక్క నగరంలోనే సంభవిస్తున్నాయి. అయితే 3 నెలల క్రితం ఇన్ని మరణాలు అక్కడ లేవు. కానీ అప్పటి లెక్కలతో ఇప్పుడు పోలిస్తే 5 రెట్లు ఎక్కువగా మరణాలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మరో తొమ్మిది వారాల్లో జపాన్‌లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. అయితే, క్రీడలు ప్రారంభమయ్యే నాటికి ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో దాదాపు 80శాతం మందికి వ్యాక్సిన్ వేస్తామని ఐఓసీ ప్రకటించింది. కానీ, 12.5కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో ఇప్పటివరకు కేవలం 2 నుంచి 3శాతం మందికే వ్యాక్సిన్ అందించారు. క్రీడలకు సమయం దగ్గరపడుతుండడం, వైరస్ ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వ్యాక్సినేషన్‌ను భారీ స్థాయిలో చేపట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా టోక్యో, ఒసాక నగరాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు స్థానిక ప్రజలు ఒలింపిక్స్ నిర్వహించవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒలింపిక్స్ నిర్వహిస్తే కొవిడ్ వ్యాప్తి పేరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.