James Webb Space Telescope: గమ్యానికి చేరిన జేమ్స్ టెలిస్కోప్
James Webb Space Telescope: విశ్వం రహస్యాలను కనుగొనేందుకు ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్-జేడబ్ల్యూఎస్‌టీ గమ్యాన్ని చేరింది.
James Webb Space Telescope: విశ్వం రహస్యాలను కనుగొనేందుకు ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్-జేడబ్ల్యూఎస్‌టీ గమ్యాన్ని చేరింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గమ్య స్థానమైన లాంగ్రేంజ్ పాయింట్-ఎల్2 నుంచి ఖగోళ సమాచారాన్ని ఇవ్వనున్నది. జేమ్స్ టెలిస్కోప్ కీలక మైలురాయికి చేరినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.
అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్‌స్సేస్ టెలిస్కోప్‌ను డిసెంబరు 25న గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాయి. ఈ టెలిస్కోప్‌ను ఎరియాన్-5 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో ఈ కొత్త జేమ్స్ వెబ్‌స్సేస్ టెలిస్కోప్‌ను ప్రవేశపెట్టారు.
మూడు దశాబ్దాలుగా 10వేల మంది శాస్త్రవేత్తలు శ్రమించి ఈ టెలిస్కోప్‌ను రూపొందించారు. రాకెట్‌లో ప్రయాణానికి అనువుగా ఉండేందుకు టెలిస్కోప్‌ను చిన్నదిగా చేసి.. గమ్యాన్ని చేరుకున్న తరువాత అసలు స్థాయికి విచ్చుకునేలా దీన్ని రూపొందించారు. జనవరి 9న జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ అసలు స్థాయికి విచ్చుకున్నది.
భారీ వ్యయ ప్రయాసలకోర్చి 73వేల కోట్లతో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగాన్ని చేపట్టారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి ఈ టెలిస్కోపుతో శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుక, నక్షత్రాలు వంటి పలు అంశాలను మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ టెలిస్కోప్ 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలందించనున్నది.