Italy: కూలిన మరో ప్రభుత్వం.. ప్రధాని రాజీనామా
*ఇటలీలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
Italy: భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ గురువారం రాజీనామా చేశారు. దీంతో ఇటలీ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నది. అక్టోబర్ ప్రారంభంలో ఇటలీ పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గురువారం ఉదయం మారియో డ్రాఘీ తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్జియో మాట్టరెల్లాకు సమర్పించారు. ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని డ్రాఘీని అధ్యక్షుడు సెర్జియో మాట్టరెల్లా ఆదేశించారు.
ప్రధానిగా మారియో డ్రాఘీ రాజీనామాకు ఆమోదం తెలిపిన మాట్టరెల్లా.. గురువారం పార్లమెంట్ ఉభయసభల స్పీకర్లతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వేసవి తర్వాత అత్యవసర ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలు జరిగితే అక్టోబర్ రెండో తేదీన పోలింగ్ జరుగవచ్చు. వార్షిక బడ్జెట్ సిద్ధం చేసే సమయంలో ఇటలీలో పార్లమెంట్ ఎన్నికలు జరుగడం అసాధారణం.