Israel: ఇజ్రాయేల్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం
Israel: కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలపడంతో.. యుద్ధానికి బ్రేక్ పడింది.
Israel: పది రోజులుగా వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుని.. అనేక కట్టడాలను నేలమట్టం చేసిన యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలపడంతో.. యుద్ధానికి బ్రేక్ పడింది. దీంతో ప్రపంచమంతా ఊపిరి తీసుకుంది. అమెరికా చొరవతోనే ఈ పరిణామం జరిగింది.
పది రోజులుగా ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య కాల్పుల మోత మోగుతుండగా.. గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఇజ్రాయేల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న 11 రోజుల హింసకు తెరిపిపడింది. కాల్పుల విరమణను హమాస్ వర్గాలు నిర్ధారించాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయేల్-హమాస్ మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో 200 మందికి పాలస్తీనా పౌరులు మృతిచెందారు.
ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు వందల సంఖ్యలో రాకెట్లు సంధించారు. మరోవైపు, హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయేల్ రాకెట్లు, యుద్ధ విమానాలతో గాజా నగరంపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరుదేశాల పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది పాలస్తీనియులు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఇజ్రాయేల్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇజ్రాయేల్‌కు అప్తమిత్రుడు అగ్రరాజ్యం అమెరికా సైతం హింసాత్మక చర్యలను తక్షణమే నిలిపివేయాలని హితబోధ చేసింది.
దాడులను తక్షణం ఆపేయాలంటూ ఇస్లామిక్ దేశాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కీలక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోవడంతో 11 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన పాలస్తీనియన్లు ఊపిరి పీల్చుకున్నారు. ''జెరూసలెంతో యుద్ధంలో ఇజ్రాయేల్‌పై సాధించిన విజయం'' అంటూ మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లు వెలువడ్డాయి. ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య కాల్పుల ఒప్పందంలో ఈజిప్టు ప్రధాన పాత్ర పోషించింది.