World War 3: మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా?

World War 3: ఇరాన్ అక్టోబర్ 1 రాత్రి వందల మిసైళ్ళతో ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

Update: 2024-10-03 12:58 GMT

World War 3: మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా?

World War 3: ఇరాన్ అక్టోబర్ 1 రాత్రి వందల మిసైళ్ళతో ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు, హెజ్బొల్లా మిలిటెంట్ లీడర్ల మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఆ దేశం మీద బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోయింది. ప్రపంచమంతా షాక్‌కు గురైంది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఏడాది తిరిగేలోగా ఇంతటి దారుణమైన మలుపు తీసుకోవడంతో మూడో ప్రపంచ యుద్ధం ఇక తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రతీకారం తప్పదు.. -ఇజ్రాయెల్

ఈ దాడులపై స్పందిస్తూ ఇజ్రాయెల్ ‘టైమ్, ప్లేస్ సరిగ్గా చూసుకుని మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని తీవ్రంగా ప్రకటించింది.

ఇరాన్ కూడా... ఇజ్రాయెల్ కనుక ప్రతీకార దాడులకు పాల్పడితే ‘దాడులతో నలిపేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య నిప్పుల వర్షం కురుస్తుంటే మిగతా ప్రపంచ దేశాలు అవాక్కయి చూస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురి చేయడం మొదలైంది.

ఇరాన్ మిసైల్ దాడులను తమ రక్షణ దళాలు మదింపు చేస్తున్నాయని, టెహ్రాన్‌కు తగిన పాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నాయని భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి గయ్ నీర్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతదుల్లా అలీ ఖమేనీ కనుక ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే అది ఇరాన్ చేసిన పెద్ద తప్పు అవుతుందని ఆయన అన్నారు. అంతేకాదు, ఈ యుద్ధంలో ఇరాన్‌కు సహకరించే దేశాల పరిస్థితి కూడా విధ్వంసకరంగా ఉంటుందని గయ్ నీర్ మీడియాతో అన్నారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్...

ఇజ్రాయెల్‌కు మిత్ర దేశమైన అమెరికా ఇప్పటికే ఆ దేశానికి మిలటరీ సహకారం అందిస్తున్నట్లు ప్రకటించింది. మిసైళ్ళను తిప్పికొట్టే టెక్నాలజీని ఇజ్రాయెల్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. మిడిల్ ఈస్ట్‌లో ఏం జరుగుతోందన్నది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గమనిస్తున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసిన ఇరాన్ మిసైళ్ళను ఆకాశంలోనే పేల్చేందుకు తోడ్పాటు అందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారని కూడా ఆ ప్రకటన తెలిపింది.

#worldwar3 సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ దారుణంగా పెరగడంతో... సోషల్ మీడియలో మూడో ప్రపంచ యుద్ధం అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జనంలో పెరుగుతున్న భయాందోళనలకు ఈ ట్యాగ్‌తో కనిపిస్తున్న పోస్టులు అద్దం పడుతున్నాయి.

మిసైళ్ళను తిప్పి కొట్టే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిలైందా... మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అని ఒక నెటిజెన పోస్ట్ చేస్తే.. మరొకరు, థర్డ్ వార్ ఆల్రెడీ మొదలైందని ట్వీట్ చేశారు.

అమెరికా సపోర్ట్ ఉన్న ఇజ్రాయెల్ మీద దాడి చేయడం ద్వారా ఇరాన్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానించిందని, ఈ యుద్ధం మానవ నాగరికతకే విఘాతం లాంటిదని మరొక వ్యక్తి ట్వీట్ చేశారు.

ఇరాన్ ఏమంటోంది?

ఈ క్షిపణుల దాడి ఆత్మరక్షణ కోసమే చేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ బుధవారం టెహ్రాన్‌లో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలను ఇరాన్ టార్గెట్ చేసిందని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. క్షిపణుల దాడుల్లో రెండు ఇజ్రాయెల్ మిలటరీ స్థావరాలు, మొసాద్ ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ టాప్ మిలటరీ అధికారి బఘేరీ చెప్పారని ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది.

కానీ, అది నిజం కాదని... ఇరాన్ ప్రయోగించిన 180 క్షిపణుల్లో చాలా వాటిని మధ్యలోనే కూల్చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, ఈ దాడులతో ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, దీనికి ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది.

ఇజ్రాయెల్ కనుక ప్రతీకారానికి తెగబడితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరస్పర హెచ్చరికలు ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

ఇజ్రాయెల్ వైపు ఎవరెవరు?

గట్టిగా గుర్తు పెట్టుకోండి... అమెరికా ఇజ్రాయెల్ వైపే ఉంది అంటూ ఇరాన్ మిసైల్ అటాక్స్ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ కూడా ఇజ్రాయెల్ రక్షణకు తమ దేశం అండగా ఉంటుందని చెప్పడమే కాదు, ఇరాన్ మీద దాడికి సిద్ధంగా ఉండడానికి సైనిక వనరులను మధ్య ప్రాచ్యానికి తరలించామని కూడా బుధవారం ఆయన ప్రకటించారు.

ఇరాన్ ఈ తెంపరితనంతో మొత్తం మధ్య ప్రాచ్యాన్నే అగ్నిగుండంలోకి తోసేస్తోందని జర్మనీ చాన్సెలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రకటించారు. ఇరాన్, హెజ్బొల్లాలు తక్షణమే తమ దాడులు నిలిపేయాలని డిమాండ్ చేశారు.

హెజ్బొల్లా, హూతీ రెబెల్స్, హమాస్ వంటి షియా ముస్లిం మిలిషియాలకు మద్దతు ఇచ్చే ఇరాన్ అంటే... సున్నీ ముస్లిం దేశమైన సౌదీఅరేబియాకు అసలు గిట్టదన్న సంగతి తెలిసిందే. సౌదీ మొదటి నుంచీ అమెరికా మిత్రదేశంగానే ఉంటోంది. కాబట్టి, అది కూడా ఇజ్రాయెల్‌వైపే ఉన్నట్లు భావించాలి.

ఇరాన్ వైపు ఎవరెవరు?

ఒకవేళ ఈ దాడులు పూర్తి స్థాయి యుద్ధంగా మారితే ఇరాన్‌ వెంట ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్ దేశాలు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రష్యా కూడా ఇరాన్ వెంటే ఉంటుంది. అయితే, టర్కీ, ఇరాక్, అఫ్గానిస్తాన్ ఘర్షణల్లో ఇరాన్ సేనలతో కలిసి మిత్రపక్షంగా పని చేసిన రష్యా.. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధమే వస్తే బరిలోకి నేరుగా దిగుతుందా అన్నది సందేహమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే, అది యుక్రెయిన్‌తో దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధంలో తల మునకలై ఉంది.

చైనా కూడా అమెరికా కూటమికి వ్యతిరేకమే అయినప్పటికీ మిడిల్ ఈస్ట్ వార్‌లో ఇరాన్ వైపు ఏమేరకు నిలబడుతుందన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇరాన్ పక్కనే ఉన్న టర్కీ, ఈజిప్ట్ దేశాలు వ్యూహాత్మక మౌనం పాటించే అవకాశాలున్నాయని కూడా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

ఇండియా వైఖరి ఏంటి?

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై స్పందించిన భారత్, ఈ పరిణామాలు తమకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. సాధారణ పౌరుల రక్షణ కోసం రెండు దేశాలూ సంయమనం పాటించాలని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

అంతర్జాతీయ దౌత్యంతో, చర్చలతో రెండు దేశాలూ యుద్ధ వాతారవరణాన్ని నివారించాలని భారత్ కోరింది. అయితే, ఒక వేళ యుద్ధమే వస్తే భారత్ ఎవరి వైపు నిలబడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. మిడిల్ ఈస్ట్‌తో భారత్‌కు చమురు కొనుగోళ్ళను మించిన వ్యాపార సంబంధాలున్నాయి. పశ్చిమా ఆసియా దేశాల నుంచి, ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్న ఇండియా, ఆ దేశాలకు ఫార్మా ఉత్పత్తులను, ఇతర మెషినరీ సామగ్రిని ఎగుమతి చేస్తోంది. రెండు దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలు బలంగా ఉన్నాయి.

అలాగే, మోదీ ప్రధాని అయిన తరువాత ఇజ్రాయెల్‌తోనూ భారత సమాంతరంగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అమెరికాతో స్నేహ బంధాన్ని పటిష్టం చేసుకుని టాప్ -5 ఎకానమీలో ఒకటిగా ఎదగాలనే లక్ష్యంతో సాగుతున్న మోదీ అంతర్జాతీయ దౌత్యం.. చివరి వరకూ యుద్ధ మేఘాలను చెదరగొట్టడానికే ప్రయత్నం చేస్తుంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో రెండు దేశాల అధినేతలతో చర్చలు జరపగలిగిన స్థితిలో ఉన్న ఇండియా, మిడిల్ ఈస్ట్‌లో కూడా మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశం ఉంది.

ట్రంప్ తెంపరితనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో చావో రేవో అన్నట్లు పోరాడుతున్న ఎన్నికల్లో గెలవడానికి ఇరాన్ బూచిని ముందుకు తెస్తున్నారు. ఇరాన్ దాడి మూడో ప్రపంచ యుద్ధం వైపు వేసిన అడుగేనని ఆయన అన్నారు. ఈ విషయంలో జో బైడెన్ మెతకగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాలో అసలు నాయకత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు. దేశానికి అధ్యక్షుడు ఉన్నా లేనట్లే ఉందని వ్యాఖ్యానించారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్ కిక్కురుమనకుండా ఉందని కూడా ట్రంప్ అన్నారు.

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి నిజంగానే అమెరికా నాయకత్వంపై ఒత్తిడి పెంచింది. ఒక వేళ ఇజ్రాయెల్ కనుక అందరూ అనుమానిస్తున్నట్లుగా ఇరాన్ చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు చేస్తే అది కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వేపు మరో అడుగు ముందుకు వేసినట్లే అవుతుంది.

ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ రిటాలియేషన్‌ను కట్టడి చేయడం కీలకంగా మారింది. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశాలు ఇజ్రాయెల్‌ను ఆపగలుగుతాయా అన్నది కీలక ప్రశ్న. భారత్ తరహాలో దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్న దేశాల కృషి ఎంతవరకు ఫలిస్తుంది? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న ప్రశ్నకు అప్పుడే జవాబు దొరుకుతుంది.

Tags:    

Similar News