International Nurses Day 2021: హ్యాట్సాఫ్ నర్సులు
International Nurses Day 2021: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
International Nurses Day 2021: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. కరోనాను కట్టడి చేయడంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులతోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. రేయింబవళ్లు రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారి బాగోగులు చూస్తున్నది నర్సులేననేది వాస్తవం. అందుకే వారందరికీ శిరసు వంచి ప్రణమిల్లుతోంది ప్రపంచం. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారు సేవలను అందిస్తున్న తీరు నర్సుల పట్ల విపరీతమైన గౌరవాన్ని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుంది. కాలిన గాయాలతో దవాఖానలకు వచ్చే బాధితులైనా.. రోడ్డు ప్రమాద క్షత గాత్రులైనా.. పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరింకెవరైనా తోబుట్టువుల్లా మొదట పలుకరించేది వాళ్లే. అలాంటి సిస్టర్స్‌కు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా సమాజం సెల్యూట్ చేస్తున్నది.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో 'నోట్స్ ఆన్ నర్సింగ్' అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్' సంస్థ 1965 నుండి నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.