Inodonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం
* ఏడుగురు మృతి, పలువురికి గాయాలు * రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదు * భూకంపం ధాటికి వందలాది భవనాలు నేలమట్టం * గత 24 గంటల్లో వరుస భూకంపాలు
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం ధాటికి వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో.. భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఏడు సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మజేనే నగరంలో నలుగురు మరణించగా.. 637 మంది గాయపడ్డారు. అలాగే పొరుగున ఉన్న మాముజు ప్రావిన్స్‌లోనూ భూంకంప ప్రభావంతో ముగ్గురు మరణించగా.. పలువురు గాయాలపాలయ్యారు.
భూకంపం ప్రభావం అధికంగానే ఉందని, అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వెస్ట్ సులవేసి గవర్నర్ కార్యాలయంతో పాటు పలుచోట్ల భవనాలు నేలమట్టమయ్యాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో వరుస భూకంపాలు వచ్చాయని ఇండోనేషియా విపత్తు సంస్థ వెల్లడించింది.