Attack on Durga Puja: బంగ్లాదేశ్‌లో దుర్గా మాత మండపాలపై దాడులు.. ఘాటుగా స్పందించిన భారత్
Attack on Durga Mata Pandals: బంగ్లాదేశ్‌లో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపాలపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. హిందూ దేవాలయాల పవిత్రతపై జరుగుతున్న దాడులు, చోరీలు, మండపాలను ధ్వంసాలు వంటి ఘటనలను భారత్ ఆ లేఖలో ప్రస్తావించింది.
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారినప్పటి నుండి అక్కడ జరుగుతున్న వరుస పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం.. ఇదే అంశాలను ఆ లేఖలో పేర్కొంది. ఢాకాలోని తంతి బజార్‌లో దుర్గా మాత మండపంపై దాడిని భారత్ ప్రశ్నించింది.
అలాగే, జెశోరేశ్వరి కాళీ మందిరంలో కాళీ మాత అమ్మవారికి భారత ప్రధాని బహూకరించిన కిరీటం చోరీ అయిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా భారత ప్రభుత్వం లేవనెత్తింది. తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు వారికి రక్షణ కరువయ్యేలా దాడులు జరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది.