Rain Water: ఆ గ్రామంలో వర్షం నీరు మాత్రమే తాగుతారట..!
*ఇండోనేషియాలోని బందర్ అనే గ్రామంలో ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసుకొని తాగుతున్నారు.
Rain Water: తాగునీరు లభించక చాలా దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఎక్కువ శాతం సముద్రాలలోనే ఉంది. ఆ నీరు తాగడానికి పనికిరాదని అందరికి తెలిసిందే. మిగిలిన కొద్ది శాతం మాత్రమే తాగడానికి పనికి వస్తుంది. ఇందులో కూడా చాలా వరకు మంచు రూపంలోనే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్న కొద్ది నీటి నిల్వలు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఇండోనేషియాలోని బందర్ అనే గ్రామంలో ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసుకొని తాగుతున్నారు.
బందర్ గ్రామ ప్రజలు వర్షపు నీటిని కొత్త టెక్నాలజీతో శుద్ది చేసుకొని నిల్వ చేసుకొని సంవత్సరం పొడవునా తాగడానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ దేశంలో తాగునీటి నియంత్రణ చాలావరకు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది. దీంతో జనాలు నీటిని కొనుగోలు చేసుకొని తాగే పరిస్థతులు నెలకొన్నాయి. కానీ బందర్ గ్రామ ప్రజలు విన్నూతన రీతిలో వర్షపు నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. విద్యుత్ విశ్లేషణ ద్వారా వర్షపు నీటిని శుభ్రపరుస్తారు. ఈ ప్రక్రియలో విద్యుత్ తరంగం నీటి గుండా వెళుతుంది దీంతో నీటిలో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. నీటి pH విలువ కూడా పెరుగుతుంది.
గ్రామంలో ట్రోమో కిర్జిటో అనే సైంటిస్ట్ ఈ టెక్నిక్‌ని అభివృద్ధి చేశారు. అతను వర్షపు నీటిని శుద్ధి చేసే పద్ధతుల కోసం చాలా సంవత్సరాలు ప్రయోగశాలలో గడిపాడు. చివరకు ఈ పద్దతిని కనుగొన్నాడు. బందర్ సమీపంలో స్వచ్ఛమైన నీటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 2000 నుంచి 4000 మి.మీ వర్షం కురుస్తుందని ఒక అంచనా. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా కరువును పరిష్కరించవచ్చు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలు వర్షపు నీటిని శుద్ది చేసి తాగుతున్నారు. అయితే ఇక్కడి ప్రభుత్వం వర్షపు నీటిని శుద్ది చేసే పద్దతులకు అండగా నిలిచి ప్రజలను ప్రోత్సహిస్తుంది.