Heavy Rains: జపాన్‌లో ప్రకృతి ప్రకోపం.. కళ్లముందే తుడిచిపెట్టుకుపోయిన భవనాలు
Japan Heavy Rains: టోక్యోలో బురదలో కొట్టుకుపోయిన ఇళ్లు * వరద బీభత్సం.. భారీగా ఆస్తినష్టం
Japan Heavy Rains: జపాన్‌లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. రాజధాని టోక్యోలో నివాస ప్రాంతాలను బురద ప్రవాహం తుడిచిపెట్టుకుపోయే దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ హృదయ విదారక ఘటనలో.. ఎన్నో ఇళ్లు, కార్లు కొట్టుకుపోగా.. ముగ్గురు మృతి చెందారు. వందలాది మంది జాడ కనిపించకుండా పోయింది. దీంతో.. ఆ ప్రాంతంలో ఎటు చూసినా రోదనలే వినిపిస్తున్నాయి.
సహాయక చర్యలను ముమ్మరం చేశారు అక్కడి అధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో వెయ్యి మందికి పైగా సైనికులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. బురదను తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 19 మందిని రక్షించిన సహాయక బృందాలు.. కనిపించకుండా పోయినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా పర్యవేక్షిస్తున్నారు. బురద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇక.. అతామీ పట్టణంలో 130 మంది ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.