Afghanistan: ఆఫ్గనిస్థాన్‌లో ఆకలి కేకలు

*అడుగంటుతున్న ఆహార నిల్వలు *2.28 కోట్ల మందికి తీవ్ర ఆహార కొరత *ప్రజల ఆకలి తీర్చడానికి వేల కోట్ల రూపాయలు అవసరం

Update: 2021-11-01 03:51 GMT

ఆఫ్గనిస్థాన్‌లో ఆకలి కేకలు

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకి దయనీయంగా మారుతున్నాయి. ఒకపక్క తాలిబన్ల పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనల మధ్య, ఇప్పుడు ఆహార కొరత కూడా ఆఫ్ఘనిస్థాన్ వాసులను ఆకలి కేకలు పెట్టేలా చేస్తున్నాయి. తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

ఒకపక్క ప్రాణభయం, మరో పక్క ఆకలి బాధ ఆఫ్ఘనిస్థాన్ వాసులను కన్నీరు పెట్టిస్తోంది. ప్రపంచమంతా ప్రజల స్వేచ్ఛా వాయువులను పిలుస్తూ బ్రతుకుతున్న నేటి రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ వాసుల నిర్బంధ జీవనం నిత్య నరకాన్ని చూపిస్తుంది. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తమకు ఉన్న స్థలాల్లో కొంత భాగాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆఫ్ఘనిస్థాన్‌లో లక్షలాది మంది ప్రజలు తినడానికి తిండి లేక విలవిలలాడుతున్నారు. 3.9 కోట్ల ఆఫ్గాన్ జనాభాలో 2.28 కోట్ల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్‌ నుంచి అంతర్జాతీయ భద్రతా దళాలు వెనక్కి వెళ్లిపోవడం, సర్కారును తాలిబన్లు చేజిక్కించుకోవడంతో దేశంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.

అంతర్జాతీయ సహాయం సైతం ఆగిపోయింది. దేశవ్యాప్తంగా నగదు కొరత నెలకొంది. నిరుద్యోగం పెరిగింది. కరెన్సీ విలువ పడిపోయింది. విదేశ మారక నిల్వలను అమెరికా, IMF జప్తు చేశాయి. వంటనూనె, గోధుమపిండి వంటి నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రపంచంలోనే అతిభారీ ఆహార సంక్షోభాల్లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు.

సంక్షోభం పెచ్చరిల్లితే పొరుగు దేశాలకు శరణార్థుల తాకిడితోపాటు, భద్రతాపరమైన కష్టాలూ తప్పవు. కఠోరమైన శీతకాలం ఆసన్నమవుతున్న పరిస్థితుల్లో అఫ్గాన్‌లో కేవలం 5శాతం కుటుంబాలకే రోజంతా తినడానికి సరిపడా ఆహార లభ్యత ఉన్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం W.H.F.P సర్వే వెల్లడించింది. అఫ్గాన్‌ విషయంలో ప్రపంచ దేశాలు సత్వరమే స్పందించకపోతే మరిన్ని సమస్యలు, సంక్షోభాలకు బీజాలు వేసినట్లే అవుతుంది.

ఆ దేశం కోసం అవసరమైన సహాయంలో ఐక్యరాజ్యసమితికి 35శాతం మాత్రమే అందుతోంది. ఛిద్రమైన అఫ్గాన్‌కు, అక్కడి నుంచి శరణార్థులు వలస వెళ్లిన పొరుగు దేశాలకు సహాయం అందిస్తామని ఈయూ ప్రకటించింది. ఆర్థిక సహాయం చేయనున్నట్లు అమెరికా, చైనాలు పేర్కొన్నాయి. విస్తృత మానవతా సహాయాన్ని అందిస్తామని భారత్‌ తమతో జరిగిన చర్చల్లో పేర్కొందని తాలిబన్‌ ప్రతినిధులు ప్రకటించారు.

Tags:    

Similar News