యుద్ధ విద్యలపై తైవానీస్ దృష్టి.. చైనా దాడికి దిగితే.. తమను తాము రక్షించుకోవాలని భావిస్తున్న తైవాన్ పౌరులు
Taiwan: ఉక్రెయిన్ పరిస్థితి తమకు రాకూడదని.. ఫిబ్రవరి నుంచే షూటింగ్ వంటి అంశాల్లో శిక్షణ
Taiwan: ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తైవాన్ దేశానికి భయం మొదలయ్యింది. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కదలికలు తైవాన్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ క్షణంలో డ్రాగన్ దాడి చేస్తుందోనని తైవాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో తైవానీస్ ముందే తేరుకున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం దేనికని అనుకున్నారేమో తైవాన్ ప్రజలు రష్యా దాడికి దిగిన తరువాత సాధారణ పౌరులకు ఉక్రెయిన్ ఆయుధాలను ఇచ్చి యుద్ధంలోకి దింపింది. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో చేతులెత్తేశారు. అలా కాకుండా ఒకవేళ యుద్ధం వస్తే పోరాడేందుకు తైవానీస్ ముందే యుద్ధ విద్యలపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. డ్రాగన్‌పై దాడికి సన్నద్ధమవుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచ దేశాలకు ఓ పాఠమయ్యింది. దేశ రక్షణకు సైన్యం, ఆయుధాలు, సైనిక శిక్షణ ఎంత ముఖ్యమో ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో తెలిసి వచ్చింది. సోవియట్ పతనం తరువాత ప్రపంచంలోనే అత్యధిక అణుబాంబులున్న ఉక్రెయిన్ ఇప్పుడు విలవిలలాడుతోంది. అదే అణ్వాయుధాలు ఉక్రెయిన్ చేతిలో ఉంటే రష్యా ఇంత సాహసం అస్సలు చేసేది కాదు అగ్రదేశాల మాటలు విని ఉన్న అణ్వస్త్రాలను నిర్వీర్యం చేసింది ఉక్రెయిన్. ఏ దేశమైనా దాడికి వస్తే కాపాడే పూచీ తమదని చెప్పిన దేశాలో ఒకటైన రష్యానే సైనిక చర్య చేపట్టింది. ఇప్పుడు ఆయుధాలు లేక నిస్సహాయ స్థితిలో ప్రపంచ దేశాల సాయం కోసం అర్థిస్తోంది. ప్రస్తుతం కీవ్ సైన్యానికి పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇస్తున్నా అవన్నీ చిన్న చిన్నవే కావడంతో ఎంత పోరాడుతున్నా పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ పట్టు కోల్పోతున్నది. ఉక్రెయిన్ పరిస్థితిని తైవానీయులు ఇప్పుడు అప్రమత్తమవుతున్నారు. ఒకవేళ చైనా తమపై దాడికి దిగితే తమను తాము కాపాడుకోవాలని భావిస్తున్నారు. రష్యా దాడి చేసిన తరువాత ఉక్రెయిన్ తమ పౌరులకు ఆయుధాలను ఇచ్చింది. అయితే వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో అవి వృథాగా మారాయి.
ఓ వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం 100 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌ను ఆక్రమణకు గోతికాడ నక్కలా ఎప్పటి నుంచో డ్రాగన్ కంట్రీ నక్కి ఉంది. తైవాన్ తమ భూభాగమని..దశాబ్దాల తరబడి.. తమ ప్రజలకు సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని బీజింగ్ దబాయిస్తోంది. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో సైనిక విన్యాసాలను చేపడుతూ.. తైవాన్‌పై ఒత్తిడిని పెంచుతోంది. తమకు లొంగిపోవాలని డ్రాగన్ హూంకరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తమ భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి అప్పగించేది లేదని.. తైవానీస్ తేల్చి చెబుతున్నారు. ఒకవేళ బీజింగ్ దాడికి దిగితే ఎదుర్కొనేందుకు తైవాన్ పౌరులు సన్నద్ధమవుతున్నారు. ఉక్రెయిన్ నేర్పిన పాఠంతో ఆ దేశంలో పలువురు పౌరులు గన్ షూటింగ్‌ఫై దృష్టి సారించారు. చైనా సైన్యం దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు యుద్ధ విద్యలపై శిక్షణ పొందుతున్నారు. మరికొందరు యుద్ధ సమయంలో అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి గన్ షూటింగ్ నేర్చుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
తైవాన్‌కు అమెరికా అండగా నిలబడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినట్టుగా.. ఆక్రమణకు దిగితే ఊరుకునేది లేదని జిన్‌పింగ్ ప్రభుత్వానికి అమెరికా హెచ్చరిస్తోంది. ఒకవేళ తమ మాటను లెక్కచేయండా ద్వీపదేశంపై జిన్‌పింగ్ దాడికి దిగితే అమెరికా సైన్యం దెబ్బ ఎలా ఉంటుందో చైనా సేనలు రుచి చూస్తాయని బైడెన్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తైవాన్ సైన్యానికి అమెరికా యుద్ధ శిక్షణ ఇస్తోంది. భారీగా ఆయుధాలను అందజేస్తోంది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. చైనా కూడా అమెరికాను హెచ్చరిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు జిన్‌పింగ్ కూడా పఠిస్తున్నారు. తమతో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జిన్‌పింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఒకవేళ తైవాన్‌పై చైనా దాడికి దిగితే మాత్రం ప్రపంచ ప్రజలకు పెనుప్రమాదం తప్పదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ తరువాత చైనాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జీరో కోవిడ్ విధానంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రజలపై జిన్‌పింగ్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభించింది. నెలల తరబడి లాక్‌డౌన్‌లనువిధించింది. ఒక్క కేసు నమోదైనా జిన్‌పింగ్ ప్రభుత్వం చేసే ఓవర్ యాక్షన్ అక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తీరుపై చైనీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు వరుస లాక్‌డౌన్‌లతో చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. మరోసారి అధ్యక్షుడు కావాలని ఉవ్విల్లూరుతున్న జిన్‌పింగ్‌కు చైనా పరిణామాలు సవాళ్లుగా మారాయి. ఈ నేపథ్యంలో ఏదో చేసి ప్రజల్లోని విశ్వాసం సాధించడం జిన్‌పింగ్‌కు తక్షణ అవసరం. అందుకు తైవాన్ అంశాన్ని తెరపైకి తెచ్చి జిన్‌పింగ్ ప్రభుత్వం సెంటిమెంట్‌ను రగిలిస్తోంది. తను వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తైవాన్ ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు జిన్‌పింగ్‌కు ఏర్పడింది. పైగా తనకు రష్యా మద్దతుగా నిలుస్తున్నదని బీజింగ్‌కు దృఢ విశ్వాసం ఉంది. అందుకే తైవాన్ ఆక్రమణకు డ్రాగన్ రంకెలేస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో తైవాన్‌పై చైనా ఆక్రమణ జిన్‌పింగ్ దిగుతారని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆక్రమణకు ప్లాన్లు వేస్తున్న చైనా.. ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.