Donald Trump: డోనల్డ్ ట్రంప్‌పై నాలుగు క్రిమినల్ కేసులు... ఆయన వెళ్ళేది వైట్ హౌస్‌కా, జైలుకా?
Donald Trump: అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మీద నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. ఇకపై ఆ కేసుల పరిస్థితి ఏంటి?
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌కు వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షాలు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘గతంలో మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌తో కొనసాగించిన సత్సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో పాటు ట్రంప్ సృష్టించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. మొన్నటి వరకూ అమెరికా చరిత్రలోనే ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన ట్రంప్, ఇప్పుడు క్రిమినల్ కేసులో కన్విక్ట్ అయిన తొలి అమెరికా ప్రెసిడెంట్‌గా కొత్త రికార్డు సృష్టించారు. 78 ఏళ్ళ ట్రంప్ బిజినెస్ రికార్డులను తప్పుగా చూపించారని అమెరికా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.
ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మీద నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. ఇకపై ఆ కేసుల పరిస్థితి ఏంటి?
క్రిమినల్ కేస్ నంబర్ - 1
అమెరికాలో 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. అయితే, ఆ ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారని, ఫలితాలను తారుమారు చేసి చూపించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అలాగే, 2021 జనవరి 6న అమెరికా కాంగ్రెస్ భవనంపై జరిగిన దాడిని సాకుగా చూపించి జో బైడెన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం రాకుండా అడ్డుపడ్డారని, ఆ విధంగా మరికొంత కాలం అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.
అమెరికాకు, ఆ దేశ ప్రజల హక్కులకు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ ట్రంప్‌పై నాలుగు రకాల అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అవన్నీ నిరాధారమైన ఆరోపణలని, బైడెన్ ప్రభుత్వం తనపై వేధింపులకు పాల్పడుతోందని ఆయన ప్రత్యారోపణలు చేశారు.
అంతేకాదు, అధ్యక్షుడిగా తనకు విచారణకు సంబంధించిన మినహాయింపులు ఉంటాయని ఆయన వాదించారు. ఆయనకు పరిమిత మినహాయింపు వర్తిస్తుందని అమెరికా సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో చాలా ఆరోపణలు కోర్టులో నిలబడే అవకాశాలు లేవు.
ఇప్పుడు ట్రంప్ గెలిచారు కాబట్టి, ఆయన తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకోవచ్చు. లేదా ఈ ఆరోపణలన్నింటినీ కొట్టివేయించవచ్చు.
క్రిమినల్ కేస్ నంబర్ -2
పోర్న్ చిత్రాల నటి స్టోర్మీ డేనియల్స్‌కు సరిగ్గా 2016 ఎన్నికలకు ముందు 1,30,000 డాలర్లు అంటే వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇచ్చారన్నది ట్రంప్ మీదున్న మరో క్రిమినల్ కేసు. ట్రంప్ తనతో సెక్స్ చేశారని చెప్పకుండా ఆమె నోరు మూయించేందుకే ఈ డబ్బు ఇచ్చారనే ఈ కేసు కూడా ఇంకా విచారణలో ఉంది. ఈ ఆరోపణలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. స్టోర్మీకి ఇచ్చినట్లు చెబుతున్న డబ్బు ట్రంప్ అకౌంట్లలో లీగల్ ఫీజు కింద ఎంటర్ చేసి ఉండడంతో కేసును సంక్లిష్టంగా మార్చింది.
అయితే, జ్యూరీ మాత్రం ట్రంప్ ఫైనాన్స్ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించినట్లుగా నిర్ధారించింది. ట్రంప్ ఎప్పట్లానే ఇది రాజకీయ కుట్ర అని అన్నారు. ఇక్కడ కూడా సుప్రీం కోర్టు గతంలో అధ్యక్షులకు ఇచ్చిన మినహాయింపులనే వర్తింప చేస్తూ ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ఆయన తరఫు లాయర్లు వాదిస్తున్నారు.
ఈ కేసులో కూడా నాలుగేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ట్రంప్ ఫైన్ కట్టి గట్టెక్కే అవకాశాలే ఎక్కువ అని న్యాయనిపుణులు చెబుతున్నారు.
క్రిమినల్ కేస్ నంబర్ – 3
డోనల్డ్ ట్రంప్ 2020 ఎన్నికల్లో జార్జియాలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమిని గెలుపుగా మార్చేందుకు కుట్ర పన్నారంటూ ట్రంప్‌తో పాటు మరో 18 మంది మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జార్జియా రాష్ట్రంలోని అత్యున్నత ఎన్నికల అధికారిని ‘11,780 ఓట్లు వచ్చేలా చూడు’ అని ట్రంప్ చేసిన ఫోన్ కాల్ లీక్ అవడం ఈ కేసులో కీలకంగా మారింది.
ఈ కేసులో కూడా తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదించారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి తేదీలు ఖరారు కాలేదు. అయితే, ఓట్ల లెక్కింపులో అవకవతకలకు పాల్పడిన కేసులో ఆరోపణలు రుజువైతే 20 ఏళ్ళ వరకూ జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతోంది.
క్రిమినల్ కేస్ నంబర్ -4
ఇది ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత వైట్ హౌస్ నుంచి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌ను తన మారా లాగో నివాసానికి తీసుకువెళ్ళారనే ఆరోపణలకు సంబంధించిన కేసు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – ఎఫ్.బీ.ఐకి ఆ పైల్స్ దొరక్కుండా చేశారని, ఆ డాక్యుమెంట్స్ విషయంలో చేసిన అక్రమాలపై క్రిమినల్ విచారణకు కూడా అడ్డుపడ్డారని ట్రంప్ మీద అభియోగాలున్నాయి.
ఈ ఆరోపణల్లో అత్యంత తీవ్రమైనది, దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని కావాలనే తన వద్ద ఉంచుకున్నారన్నది. ఇది గూఢచర్యానికి పాల్పడడమనే నేరం కిందకు వస్తుంది. దీని చుట్టూ ఎనిమిది రకాల అభియోగాలు నమోదైనా, ట్రంప్ మాత్రం తనకే పాపం తెలియదనే చెబుతూ వచ్చారు.
అయితే, ఈ కేసును ఫ్లోరిడా కోర్టు జూలై 15న కొట్టేసింది. పెన్సిల్వేనియాలో హత్యా ప్రయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న తరువాత ట్రంప్‌కు లభించిన పెద్ద విజయమిది. స్పెషల్ ప్రాసిక్యూటర్ నియామకం అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందనే వాదనతో ట్రంఫ్ తరఫు లాయర్ ఈ కేసును కొట్టేయించారు. కానీ, ఆ స్పెషల్ ప్రాసిక్యూటర్ దీని మీద అపీలుకు వెళ్ళారు. అయితే, ట్రంప్ లాయర్లు ఈ కేసు విచారణను అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ విచారణకు రాకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.
గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే పదేళ్ళు, అధికారిక పత్రాలు తరలించే కుట్రకు పాల్పడినట్లు తేలితే 20 ఏళ్ళ వరకూ ట్రంప్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కానీ, ఇప్పుడు ఆయనే అధ్యక్షుడిగా మరోసారి గెలిచారు. మళ్ళీ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేసుల కంచికి చేరినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.