Omicron Covid Variant: ఒమిక్రాన్ తొలి చిత్రం.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే..
Omicron Covid Variant: ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది.
Omicron Covid Variant: ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. సార్స్‌కోవ్-2 వైరస్‌లో మ్యూటేషన్ చెంది కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఒమిక్రాన్‌ను డెల్టాతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత 'బాంబినో గెసు' ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఈ త్రీడైమెన్షనల్ చిత్రం ఒక మ్యాప్‌లా ఉంది.
డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్లో చాలా మార్పులు చోటు చేసుకొన్నట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. ఆ మార్పులు మొత్తం మానవ శరీరానికి అతుక్కునే ఒక ప్రొటీన్ భాగంలోనే చోటు చేసుకొన్నట్లు అర్థమవుతోంది. ఇవి కేవలం ప్రమాదకరమైనవే కాదు మానవులకు భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయి అని పరిశోధకులు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రోమ్‌లోని ఈ పరిశోధన బృందం కరోనావైరస్‌లో వచ్చే మ్యూటేషన్ల స్పైక్ ప్రొటీన్ త్రీడైమన్షనల్ ఇమేజస్ పై దృష్టిపెట్టిందని మిలన్ స్టేట్ యూనివర్శిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ క్లౌడియా ఆల్టరీ పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్‌తో వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతుందా..? వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గుతుందా? అనే అంశాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు.