జపాన్ లో భారీ భూకంపం.. భూకంప తీవ్రత 7.3గా నమోదు.. సునామీ హెచ్చరికలు...
Japan - Earthquake: టోక్యోలో నిలిచిపోయిన కరెంట్ సరఫరా...
Japan - Earhthquake: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఆదేశ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో సముద్ర తీరమైన పుకుషిమా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది.
ఇక భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. మరోవైపు జపాన్ రాజధాని టోక్యోలోనూ భూ ప్రకంపనలు కొద్ది నిమిషాల పాటు కొనసాగుడంతో నగరమంత విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు సమాచారం.
టోక్యోలో 7లక్షల ఇళ్లతోపాటు మొత్తంగా 20లక్షలకు పైగా ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. అదేవిధంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు తెలియజేసింది. అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ప్రధాని కార్యాలయం వద్ద టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. పలు మంత్రిత్వశాఖలు, మున్సిపాల్టీలు పరస్పర సహకారంతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జపాన్ ప్రధాని ఆదేశించారు.