అమెరికాలో తలకిందులవుతున్న ట్రంప్ ఆశలు
అమెరికా అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో జో బైడెన్ నిలిచారు. మొదటి నుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. దీంతో మరోసారి అగ్రరాజ్య పగ్గాలు చేపట్టాలన్న ట్రంప్ గెలుపు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి.
అమెరికా అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో జో బైడెన్ నిలిచారు. మొదటి నుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. దీంతో మరోసారి అగ్రరాజ్య పగ్గాలు చేపట్టాలన్న ట్రంప్ గెలుపు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ప్రస్తుతం ట్రంప్ భారీ ఆశలు పెట్టుకున్న పెన్సిల్వేనియాలో లీడ్ గల్లంతయింది. పెన్సిల్వేనియాలో ఇప్పటికే బైడెన్ భారీ లీడ్ లో ఉండగా.. జార్జియాలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్జియాలో ఇప్పటికే 99శాతం ఓట్లు లెక్కింపు పూర్తైంది.
ఇక ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగి జార్జియాలో గెలిస్తే అక్కడున్న 16 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్‌కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ గనుక గెలుపు ఖాయమైతే అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్ సొంతమవుతుంది. ఇక నెవెడాలోనూ గెలిచినట్లయితే బైడెన్ 290 ఓట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. జార్జియా ఫలితంతో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠకు ఇవాళే తెర పడే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం పెన్సిల్వేనియాలో 5 వేల 587 ఓట్ల ఆధిక్యంలో బైడెన్ కొనసాగుతుండగా.. జార్జియాలో ఒక వెయ్యి 96 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. అటు నెవెడాలో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతుండడంతో అక్కడ కూడా బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నార్త్ కరోలైనా, అలస్కాలో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. మరోవైపు మొత్తం ఐదు రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా గెలిస్తేనే ట్రంప్ విజయం సాధించే అవకాశం ఉంది. అటు నెవాడా, పెన్సిల్వేనియా, జార్జియాలో ఏ ఒక్కటి గెలిచినా బైడెన్ కు అధ్యక్ష పీఠం ఖాయం కానుంది.
మరోవైపు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కి చేరువైన జో బైడెన్ విజయం ఖాయమని ఆయన ప్రచార వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్లు బైడెన్‌కు భద్రతను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బైడెన్ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ అధికారులను పంపించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బైడెన్ శుక్రవారం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని.. దీంతో ఆయనకు భద్రత కల్పించేందుకు సీక్రెట్ సర్వీస్ ఏర్పాట్లు చేస్తోందని తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.