Ecuador: ఈక్వెడార్‌లోనే అతిపెద్ద జైల్‌లో మారణకాండ
Ecuador: లిటోరల్ పెనిటెన్షియరీలో ఖైదీల మధ్య ఘర్షణ
Ecuador: ఈక్వెడార్‌లోనే అతిపెద్ద జైల్ లిటోరల్ పెనిటెన్షియరీ మరోసారి రక్తసిక్తమైంది. అర్థరాత్రి ఒక్కసారిగా చెలరేగిన ఘర్షణల్లో 68 మంది ఖైదీలు మరణించగా మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. తీర ప్రాంత నగరమైన గుయాక్విల్‌లోని జైలులో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్స్‌తో సంబంధం ఉన్న జైలు ముఠాల మధ్య ఈ భీకర హింస చోటుచేసుకుందని పోలీసు నివేదిక తెలిపింది. ఖైదీల నుంచి తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ హింస దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగినట్లు జైలు అధికారులు తెలిపారు.
మరోవైపు ఘర్షణ సమయంలో ఖైదీలు ప్రత్యర్థి ఖైదీలను చంపడానికి జైలులోని మరొక భాగానికి వెళ్లడానికి డైనమైట్‌తో గోడను పేల్చివేయడానికి ప్రయత్నించారు. శత్రు ఖైదీలను చంపేందుకు ఖైదీలు తమ పరుపులను తగలబెట్టారని, ఈ చర్యల ఖైదీలు పొగలో చనిపోతారని గుయాస్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఇక ఖైదీల మధ్య ఘర్షణల నేపధ్యంలో 700 మంది పోలీసులు జైలులో పరిస్థితిని అదుపు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు.
రెండు నెలల క్రితం ముఠాల మధ్య జరిగిన పోరులో 119 మంది ఖైదీలు మరణించారు. మళ్లీ ఇదే జైలులో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. లిటోరల్ పెనిటెన్షియరీ జైలులో 8000 మంది ఖైదీలు ఉన్నారు. హింసాత్మక సమయంలో జైలుపై డ్రోన్‌లు ఎగురవేయడం వల్ల జైలులోని మూడు భాగాలలో ఖైదీల వద్ద తుపాకులు, పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించామని పోలీసు కమాండర్ జనరల్ తాన్యా వరేలా చెప్పారు. ఖైదీలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసే వాహనాలను గుర్తించామన్నారు.