Vladimir Putin: అఖండ సోవియట్ ఏర్పాటు పుతిన్ కల

Vladimir Putin: సోవియట్‌ పతనాన్ని జీర్ణించుకోలేని పుతిన్‌

Update: 2022-02-25 03:48 GMT

 అఖండ సోవియట్ ఏర్పాటు పుతిన్ కల

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆశ, ఆశయం సోవియట్‌ యూనియన్‌.. రష్యన్‌ భాష మాట్లాడే పాత సరిహద్దులతో మళ్లీ ఓ సామ్రాజ్యాన్ని తీసుకురావాలన్నదే పుతిన్‌ కల.. అందులో భాగంగా సోవియట్‌ పూర్వ వైభవం కోసం పుతిన్‌ పావులు కదుపుతున్నారు. రష్యా చరిత్ర మార్చే అవకాశం వస్తే.. సోవియట్‌ యూనియన్‌ను మళ్లీ తెస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచంలో రష్యాను మళ్లీ అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

1991 డిసెంబరు 25న సోవియట్‌ యూనియన్‌ పతనమవడం పుతిన్‌ జీర్ణించుకోలేకపోయారు. సోవియట్‌ కుప్పకూలడం రష్యాకు చారిత్రక మరణమని పుతిన్‌ చెబుతుంటారు. ఆ తరువాత రష్యాలో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో టాక్సీ డ్రైవర్‌గా పని చేసినట్టు చెప్పుకుంటారు. రెండున్నర కోట్ల మంది రష్యన్లు కొత్త దేశాలకు వెళ్లిపోవడం తనను పూర్తిగా కలచివేసిందని పుతిన్‌ ఆవేదన వ్యక్తం చేస్తారు. రష్యన్‌ భాష, సంస్కృతి ఈ ప్రపంచాన్ని శాసించాలన్నదే పుతిన్‌ ఆశ.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నాటో ఆవిర్భవించింది. 12 దేశాల కూటమిగా ఏర్పాటయింది. అయితే సోవియట్‌ యూనియన్‌ పతనంతో కొత్తగా ఆవిర్భవించిన దేశాలు నాటో కూటమిలో చేరడాన్ని పుతిన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. సోవియట్‌ యూనియన్‌ దేశాలను నాటోలో చేర్చుకోవద్దంటూ పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పు ఐరోపాలో తమ అనుమతి లేనిదే నాటో దళాలు మోహరించరాదంటూ పుతిన్‌ హెచ్చరిస్తున్నారు. కానీ పాశ్చాత్య దేశాలు పుతిన్‌ డిమాండ్లను బేఖాతరు చేస్తున్నాయి. దీంతో ఆ డిమాండ్లను నెరవేర్చుకునేందుకే ప్రస్తుతం ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక సోవియట్‌ యూనియన్ దేశాల్లో రష్యా తరువాత పెద్ద దేశం ఉక్రెయిన్‌.. ఈ దేశంలో తూర్పు ప్రాంతంలో ఎక్కువగా రష్యన్‌ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. పైగా ఉక్రెయిన్‌ చారిత్రాక్మంగా రష్యాలో అంతర్భాగమనే పుతిన్‌ వాదిస్తారు. అయితే ఉక్రెయిన్‌ పుతిన్‌ వాదనను కొట్టిపడేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నాటోలో చేరడాన్ని పుతిన్‌ అస్సలు అంగీకరించడం లేదు. పైగా ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులకు రష్యా మద్దతు ఇస్తోంది. 

Tags:    

Similar News