World Delta Variant : ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తున్న డెల్టా వేరియంట్
* టీకా తీసుకోని వారిపై పంజా విసురుతున్న కోవిడ్ * శ్రీలంకలో 1.5శాతం డెల్టా వేరియంట్ మరణాలు
World Delta Variant : ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్ దడ పుట్టిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరగడంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే 1.3 లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా ఇప్పుడు 6 వారాల్లోనే ఆ సంఖ్యను దాటేయడం అక్కడి తీవ్రతను తెలుపుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం రోజుకి 270 కొవిడ్ మరణాలు సంభవించగా శుక్రవారానికి ఆ సంఖ్య 700 దాటింది.
అగ్రరాజ్యంలో వ్యాక్సిన్ తీసుకోని వారిపై కోవిడ్ పంజా విసురుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. మరింత మంది అమెరికన్లు టీకాలు తీసుకోకపోతే కేసుల పెరుగుదల ఇంకా తీవ్రంగా ఉండొచ్చని ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 41శాతం ఫ్లోరిడా, జార్జియా, అలబామా, మిసిసిపీ, కరోలినా, టెన్నెస్సీ, కెంటకీల్లోనే ఉంటున్నారు.
మరోవైపు శ్రీలంకలో కరోనా డెల్టా రకం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపధ్యంలో అప్రమత్తం అయిన శ్రీలంక ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ప్రతి వ్యక్తికీ కోవిడ్ ముప్పు పొంచి ఉందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. డెల్టా రకం సోకినవారిలో 1.5శాతం మంది మృత్యువాత పడుతున్నారు.