Delta Variant: విజృంభిస్తున్న డెల్టా వేరియంట్
Delta Cases: ఆగ్నేయాసియాతో పాటు ఇతర దేశాల్లో డెల్టా కేసులే అధికం * మరణాల రేటు స్వల్పంగా ఉన్నట్లు వెల్లడి
Delta Cases: దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా రకమే ఎక్కువగా ఉన్నట్లు కొవిడ్-19పై ఏర్పాటైన కన్సార్టియం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగానూ వైరస్ విజృంభణకు ఈ రకమే కారణమని వెల్లడించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాతో పాటు ఇతర దేశాల్లోనూ డెల్టా రకం కేసులే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఈ రకం వైరస్ సోకిన కేసుల్లో కేవలం 10 శాతం మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని, మరణాల రేటు కూడా స్వల్పంగా ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా గత నాలు వారాలుగా పాజిటివ్‌గా తేలిన వాటిల్లో 75 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌వేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత వారంలో ఇండోనేసియాలో అత్యధికంగా 44% పెరుగుదలతో 3లక్షల 50వేల 273 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 2లక్షల 68వేల 843 కొత్త కేసులతో 8 శాతం పెరుగుదల, అమెరికాలో 68% పెరుగుదల నమోదైనట్లు వివరించింది. రాబోయే నెలల్లో డెల్టా వేరియంట్ కేసులే అత్యధికంగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. భారత్‌లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్‌వే ఉంటున్నాయని నిపుణులు స్పష్టం చేశారు.