Kohinoor Diamond: కోహినూర్ వజ్రం దక్కేదెవరికి?
*వజ్రాన్ని ఇవ్వాలని బ్రిటన్ పలుమార్లు కోరిన భారత్
Kohinoor Diamond: ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూర్ విశిష్టతే వేరు.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రమిదే. కొన్ని వేల ఏళ్ల చరిత్రకలిగిన ఈ వజ్రం మనదే.. తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో రాజవంశాల చేతులు మారిన ఈ వజ్రం.. చివరికి దేశం దాటి.. బ్రిటన్‌కు చేరింది. అక్కడి రాజ కుటుంబానికి వారతస్వ సంపదగా మారింది.. ప్రస్తుతం బ్రిటన్ మహారాణి, ఎలిజబెత్-2 కన్నుమూయడంతో.. అటు బ్రిటన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ కోహినూర్ వజ్రంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్రజం ఇప్పుడు ఎవరికి దక్కుతుందని బ్రిటన్‌లో చర్చిస్తుండగా.. అది తమదని.. తమ దేశానికి అప్పగించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వజ్రం ఎక్కడిది? బ్రిటన్‌కు ఎందుకు వెళ్లింది? బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకురావడం ఎందుకు సాధ్యం కావడం లేదు?
70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన మహారాణి ఎలిజబెత్-2 96 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. దీంతో అటు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ, ఇటు భారత్‌లోనూ ఇప్పుడు కోహినూర్ వజ్రంపై చర్చ మొదలైంది. ఎలిజబెత్-2 ప్లాటినం కిరీటంలోని ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి దక్కుతందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. 1937లో కింగ్ జార్జి-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్ వజ్రం ఉంది. ఒకప్పుడు 793 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం.. ఇప్పుడు 105.6 క్యారెట్లకు తగ్గిపోయింది. బ్రిటన్ రాచరిక వ్యవస్థ ప్రకారం.. ప్లాటినం కిరీటం... సహజంగా రాజు భార్యగా రాణికి దక్కుతుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. ప్రస్తుతం కింగ్‌గా బాధ్యతలు చేపట్టిన చార్లెస్‌కు భార్యగా కెమిల్లాకు ఆ కిరీటం దక్కాలి. అయితే.. చార్లెస్‌కు కెమిల్లా రెండో భార్య కావడం.. ఆమెకు కూడా ఇది రెండో వివాహం కావడంతో... ఆమెకు ప్లాటినం కిరీటం దక్కుతుందా? అన్న అనుమానాలు రేపుతున్నాయి. నిజానికి కింగ్ చార్లెస్‌కు మొదటి భార్య డయానా. అయితే 1996లో చార్లెస్, డయానా విడిపోయారు. ఆ తరువాత ఏడాదికే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. డయానా గౌరవార్థం ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్‌గా ఆమెనే కొనసాగిస్తున్నారు. 2005లో కెమిల్లాను రెండో వివాహం చేసుకున్నా.. ఆమెకు మాత్రం ప్రిన్సెస్ హోదా దక్కలేదు. అయితే కెమిల్లాకు రాణి హోదా దక్కాలని ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లి వేడుకల్లో ఆకాంక్షించారు. దీనిపై ఇప్పటికీ అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి.
మరోవైపు రాణి ఎలిజబెత్ మరణంతో.. భారత్‌లో సోషల్ మీడియాలో కోహినూర్ వజ్రంపై జోరుగా చర్చ జరుగుతోంది. కోహినూర్ హ్యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. కోహినూర్ వజ్రం తమదని.. ఇప్పటికైనా భారత్‌కు అప్పగించాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారత్ నుంచి దోచుకున్న పురాతన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేయాలంటున్నారు. భారత ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే.. దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం పలుమార్లు బ్రిటన్‌ను సంప్రదించింది. 2010లో అప్పటి యూకే ప్రధాని డేవిడ్ కెమరాన్ స్పందించారు. ఒకవేళ భారత్‌కు కోహినూర్‌ను ఇవ్వాల్సి వస్తే.. చాలా దేశాలకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీంతో బ్రిటీష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని చమత్కరించారు. ఇదిలా ఉంటే.. దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా విచారణ జరిపింది. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమని తేల్చి చెప్పింది. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్-1972 ప్రకారం.. దేశం నుంచి అక్రమంగా ఎగుమతి చేసినవి.. లేదా తస్కరించిన అరుదైన వస్తువులు, సంపదను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారికి బహుమతిగా ఇచ్చిన వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయమని ఒత్తిడి చేయాలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే బ్రిటిష్ వారికి ఎవరు బహుమతిగా ఇచ్చారు? తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎక్కడి నుంచి చేతులు మారింది?
తెలుగునేలకు, కోహినూర్ వజ్రానికి విడదీయరాని సంబంధం ఉంది. 5వేల ఏళ్ల క్రితమే ఈ వజ్రాన్ని తెలుగు నేల మీద గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో కోహినూర్ వజ్రం దొరికినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వజ్రం క్రీస్తుశకం 13 వందల సంవత్సరంలో యజమాని మాల్వరాజు మహలక్ దేవ్ వద్ద ఉండేదని వివరిస్తున్నారు. ఆ తరువాత మాల్యాను అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి.. అక్కడి ధనరాసులతో పాటు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కొల్లూరులో లభ్యమైన కోహినూర్.. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేదట.. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు 13 వందల 10లో ఢిల్లీ సుల్తానుకు పంపినట్టు మరో కథనం ప్రచారంలో ఉంది. అలా ఢిల్లీ సుల్తానుల నుంచి 1849 నాటికి సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి చేరిందట. ఆయన దాన్ని తన కిరీటంలో ధరించినట్టు తెలుస్తోంది. 1839లో ఆయన మరణం తరువాత.. దిలీప్ సింగ్‌కు కోహినూర్ దక్కింది. 1849లో బ్రిటన్ సేనలు దిలీప్‌సింగ్‌ను ఓడించాయి. ఆ సమయంలో అతడు వజ్రాన్ని విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇచ్చారట. ఇలాంటివి రెండు మూడు కథనాలు ప్రచారంలో ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.
అసలైన కోహినూర్ వజ్రం బరువు 793 క్యారట్లు ఉంది. అది విక్టోరియా రాణి చెంతకు చేరేసరికి 186 క్యారట్ల బరువుందట. దాన్ని ఆమె సానబెట్టించగా.. 108 క్యారెట్లకు తగ్గిపోయింది. దీంతో ఆ వజ్రాన్ని కిరీటంలో తాపడం చేయించింది. అప్పటి నుంచి కోహినూర్ బ్రిటన్ రాజకుటుంబం కిరీటంలో వెలుగులీనుతోంది. ఆమె తరువాత క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్-2 ధరించారు. వాస్తవానికి బ్రిటన్ కోహినూర్ వజ్రాన్ని ఇప్పటివరకు కానుకగా ఇవ్వడం తప్ప.. అమ్మడమో బలవంతంగా లాక్కోవడమో జరగలేదు. అంతేకాదు.. ఎవరూ దాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కోహినూర్ వజ్రానికి శాశ్వత యజమానులు ఎవరూ లేరు. కానీ.. ఈ వజ్రానికి అసలు యజమాని ఎవరన్న దానిపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. భారత్‌తో సహా మరో నాలుగు దేశాలు కోహినూర్ వజ్రంపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. స్నేహపూర్వక పద్ధతిలో వజ్రాన్ని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత పురావస్తు విభాగం కొంతకాలం క్రితం ప్రకటించింది. ఇదిలావుంటే, కోహినూర్ తమదంటే తమదేనని పాకిస్థాన్, ఇరాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్‌ను తమకే అప్పగించాలంటూ.. 1976లో పాక్ ప్రధాని భుట్టో బ్రిటన్ ప్రధానికి లేఖ రాశారు. 2000లో తాలిబన్లు కూడా కోహినూర్ తమదేనని, త్వరగా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కోహినూర్ వజ్రాన్ని రాజుకు కాకుండా.. రాణుల కిరీటంలో ఎందుకు పొదిగారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ వజ్రాన్ని కేవలం మహిళలు మాత్రమే ధరించాలని.. లేదా భగవంతుడి ఆభరణాల్లో పొదగవచ్చని ప్రచారన్న ప్రచారం ఉంది. పురుషులు ధరిస్తే రక్తపాతం తప్పదని.. చరిత్ర అదే చెబుతోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానాలు లభించడం లేదు.