Turkey: ప్రకృతి ప్రకోపానికి శిథిలాల దిబ్బగా మారిన టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగోతంది. పెనుభూకంపం కారణంగా ఈ సంఖ్య 25వేలు దాటింది. తమ దేశంలో భూకంప మృతుల సంఖ్య 22వేలకు చేరిందని ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్ ప్రకటించారు. సిరియాలో మరణించిన వారి సంఖ్య 3వేల 500 దాటింది. టర్కీలో 80వేల మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు ఎర్దోగాన్ తెలిపారు. అయితే ఐదు రోజుల తర్వాత కూడా పలువురు మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో ఆచూకీ లేకుండాపోయిన తమ వారిపై బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు భారత సైన్యానికి చెందిన వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన ఆస్పత్రుల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా వైద్య పరికరాలు, మందులు, ఇతర సహాయ సామాగ్రితో మరో విమానం శనివారం ఢిల్లీ నుంచి టర్కీకి వెళ్లంది.