ఒక్క నిమిషంలో కరోనా జాడ తెలుసుకోవచ్చు..త్వరలోనే ఇజ్రాయెల్ పరికరం!
ఇప్పుడు ప్రపంచం భయపడేది.. ప్రజలకు నిద్రలేకుండా చేసింది.. కరోనా వైరస్. కంటికి కనబడదు.. ఎప్పుడు ఎటునుంచి తగులుకుంటుందో తెలీదు..
ఇప్పుడు ప్రపంచం భయపడేది.. ప్రజలకు నిద్రలేకుండా చేసింది.. కరోనావైరస్. కంటికి కనబడదు.. ఎప్పుడు ఎటునుంచి తగులుకుంటుందో తెలీదు.. అంటుకున్న తరువాత కూడా నేనున్నానని చప్పుడు చేయడానికి కనీసం నాలుగు రోజులు తీసుకుంటుంది. దాని బారిన పడినవారి ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాదు పక్కన ఎవరు కనబడితే వాళ్ళని పలకరించి వారందరి జీవితాల్ని అతలాకుతలం చేసేస్తుంది. ఆధునిక ప్రపంచంలో..చంద్రమండలాన్ని జయించిన మానవుడికి ఈ కంటికి కనిపించని ఒక్క చిన్న జీవిని ఎలా అడుపుచేయాలో తెలీడం లేదు. కరోనాతో ఉన్న అతి పెద్ద చిక్కు. ఈ వ్యాధి సోకింది అని నిర్ధారించడానికి కూడా కనీసం రెండు రోజులు పడుతుండటం. ర్యాపిడ్ టెస్ట్ వచ్చినా అది కూడా ఒకరోజు సమయం తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో కరోనా పొరపాటున సోకినా వారు వారికి తెలీకుండానే చాలా మందికి దానిని చేరవేసే వాహకాలుగా మారిపోతున్నారు.
సరిగ్గా ఈ సమస్య మీదే దృష్టి పెట్టారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. వారు కరోనా వైరస్ జాడను కనిపెట్టే అతి చిన్న, సులువైన మార్గాన్ని కనిపెట్టారు. దీంతో రెండు నిమిషాల్లోనే కరోనా వైరస్ బాధితుడికి ఉందా లేదా అనేది కన్పెట్టేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రాధమికమైన ట్రయల్స్ పూర్తిచేసుకున్న ఈ పరీక్ష ఇప్పుడు అమెరికా ఫుడ్ and డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
the australian jewish news వెబ్సైట్ కథనం ప్రకారం ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక్క నిమిషంలోనే..
ఇజ్రాయెల్ కు చెందిన బెన్-గురియన్ యూనివర్శిటీ ఆఫ్ నెగెవ్‌లో ప్రొఫెసర్ గాబీ సారుసి నేతృత్వంలోని బృందం ఒక సరికొత్త విధానాన్ని కరోనా వైరస్ ఉనికిని కనిపెట్టడానికి ఆవిష్కరించింది. ఇప్పడున్న పద్ధతుల్లో కరోనా అనుమానం ఉన్న వ్యక్తీ గొంతు, ముక్కు నుంచి తీసుకునే నమూనాలను రసాయనాలతో కలిపి పరీక్షించడం ద్వారా కరోనా వ్యాధిని కనిపెట్టి ఖరారు చేస్తాయి. అయితే, గాబీ సారుసి బృందం దీనికి భిన్నమైన ప్రక్రియను ఎన్నుకుంది. దీనిప్రకారం.. సార్స్ కోవిడ్ -2 రకం వైరస్ ను ఫ్రీక్వెన్సీ ఆధారంగా గుర్తించవచ్చు. దీనిని ఇప్పటివరకూ 90 శాతం పరీక్షల్లో విజయవంతం అయింది.
ఈ వైరస్ దాని పరిమాణం, విద్యుత్ లక్షణాల పరంగా 100nm నుండి 140nm మధ్య వ్యాసం కలిగిన నానో-పార్టికల్ లేదా క్వాంటం డాట్ లాంటిది. కాబట్టి, భౌతికశాస్త్రం, ఫోటోనిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విధానాలను అనుసరించి దీనిని గుర్తిన్చావచ్చేమో అనే ప్రశ్న నుంచి ఈ ఆవిష్కరణ తయారైనట్టు ప్రొఫెసర్ చెప్పారు.
''మాకు మేముగా పై రకంగా ప్రశ్నించుకుని జవాబు కోసం పరిశోధనలు చేశాం. దీంతో ఈ విధానాన్ని కనిపెత్తగాలిగాం. ఈ వైరస్ ఫ్రీక్వెన్సీ ని మేము పట్టుకున్నాం. ఇది THz పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) వద్ద రెస్పాండ్ అవుతోంది. దీన్తిలో స్పెక్త్రోస్కోపీ లొ ఈ ఫ్రీక్వెన్సీ వద్ద వచ్చే ప్రతిధ్వని ఆధారంగా ఈ వైరస్ ను సులువుగా గుర్తించవచ్చు.'' అని ఆయన చెప్పారు.
ఏదైనా వైరస్లతో సహా శ్వాస నుండి చిన్న కణాలను సంగ్రహించడానికి దట్టంగా ప్యాక్ చేసిన సెన్సార్‌లతో చిప్‌తో ఉన్న చేతితో పట్టుకుని పనిచేసే పరికరాన్ని తాయారు చేయడానికి సారుసి బృందం ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది.
ఇప్పుడు వీరు చెబుతున్న కరోనా వైరస్ కోసం కనిపెట్టిన పరికరం వైరస్ కు ఉన్న లక్షణమైన THz ను స్పెక్ట్రోస్కోపీ ద్వారా చదువుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ కదలికలను శాస్తవేత్తలు గుర్తిస్తారు. ఒకవేళ లక్షణాలు లేకుండా ఎవరైనా కరోనా వైరస్ ను మోస్తున్నత్తయితే.. ఒక్క నిమిషం లోపులో వారు ఆ విషయాన్ని ద్రువీకరించగలుగుతారు.
పోర్టులు, కార్యాలయాలు, క్రూయిజ్ షిప్స్ వంటి ప్రదేశాలలో దేశవ్యాప్తంగా ఈ బ్రీత్‌లైజర్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ప్రతి పరికరం ప్రతిరోజూ సుమారు 4,000 మంది ప్రజల నుండి శ్వాసను ప్రాసెస్ చేస్తుందని ప్రొఫెసర్ గబీ సారుసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను ధ్రువీకరించిన తరువాత, అమెరికా ఫుడ్ and డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులను పొందాల్సి ఉంది. ఈ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ నెల లోపు ఈ పరికరం పనితీరును బహిరంగంగా మనం చూడగాలుగుతామని ఆశిస్తున్నట్టు వారు చెప్పారు.
ఇప్పుడు ఈ పరిశోధకులు చెప్పినట్టుగా ఇటువంటి పరికరం అందుబాటులోకి వస్తే కరోనా గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఉండదు. మామూలు జ్వరాన్ని గుర్తించే ధర్మామీటర్ లా ఈ వైరస్ ను గుర్తించి వైరస్ కదలికలు ఉన్న వ్యక్తిని క్వారంటైన్ చేయడం ద్వారా కరోనా నివారణ తేలికగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరికరం త్వరలోనే అందుబాటులోకి రావాలని కోరుకుందాం.