మళ్లీ విజృంభిస్తున్న కరోనా

Coronavirus: కరోనా రక్కసి మళ్లీ విజృభిస్తోంది.

Update: 2022-03-15 09:26 GMT

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

Coronavirus: కరోనా రక్కసి మళ్లీ విజృభిస్తోంది. అమెరికా, ఐరోపాతో పాటు ఆసియా దేశాల్లోనూ భారీగా కేసులు పెరుగుతున్నట్టు అమెరికాకు చెందిన జాన్స్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ- జేహెచ్‌యూలోని కరోనా వైరస్‌ రిసోర్స్‌ విభాగం తెలిపింది. వారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫిన్‌లాండ్‌లో ఏకంగా 84 శాతం కేసుల పెరిగినట్టు జేహెచ్‌యూ తెలిపింది. ఫిన్‌లాండ్‌లో వారం రోజుల్లో 62వేల 500 కేసులు పెరగగా స్విట్జర్‌లాండ్‌లో లక్షా 82వేలు, యునైటెడ్ కింగ్‌డమ్ లో 4 లక్షల 14వేల కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలోనూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. సెంటర్స్‌ ఫర్‌ డీసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్‌షన్‌ డేటా ప్రకారం కేసులు భారీగా పెరుగుతున్నట్టు బ్లూమ్‌బర్గ్‌ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. మార్చి 1 నుంచి 10వ తేదీలో కరోనా కేసుల సంఖ్య పెరిగినట్టు వివరించింది. అయితే కేసుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. చైనాలోనూ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా అక్కడ 5 వేల 280 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జిలిన్ ప్రావిన్స్‌లో 2వేల 601 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చైనా ప్రభుత్వం పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్ దక్షిణ కొరియాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వారం రోజులుగా నిత్యం 3 లక్షల 37వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 300 మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశంలో ఇప్పటివరకు 72 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్స కోసం దక్షిణ కొరియా ప్రభుత్వం ఏర్పాట్లు భారీగా చేసింది. ఐసీయూల్లో 30శాతం కంటే ఎక్కువ మందికి అందుబాటులో ఉంచింది. కరోనా పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటికే 62 శాతం మందికి బూస్టర్‌ డోసు టీకాను ఇచ్చినట్టు దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News