అక్కడ కరోనా సెకండ్ వేవ్.. మరోసారి లాక్‌డౌన్!
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఫ్రాన్స్ దేశాన్ని చుట్టుముట్టేసింది. దీంతో మళ్ళీ అక్కడ మరోసారి లాక్‌డౌన్ విధించారు.
కరోనా రెండో అల మెల్లగా ప్రపంచంలో మళ్ళీ అలజడి రేపుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో మళ్ళీ కరోనా వైరస్ రెచ్చిపోతోంది. దీంతో ప్రతి రోజు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్య ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించింది.
ప్రజలు స్వస్థలాల బాట..
లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు రావడంతోనే ప్రజలంతా స్వస్థలాలకు పయనమయ్యారు. వారాంతం కావడం.. ఒక్కసారిగా ప్రజలు ప్రయాణాలు మొదలు పెట్టడంతో ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. దీంతో పారిస్‌లో 700 కిలో మీటర్ల మేర వరకు ట్రాఫిక్ స్తంభించింది. నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాలన్ని భారీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మూసుకుపోయాయి. దీంతో బయటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జాంను నియంత్రించలేక పోలీసులు అవస్థలు పడ్డారు.
ఈ ఏడాది మార్చిలోనూ పారిస్‌లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఫ్రాన్స్‌లో తొలిసారిగా లాక్‌డౌన్ విధించినప్పుడు పారిస్ నుంచి దాదాపు 12 లక్షల మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. పారిస్ నగరం దాదాపు ఐదో వంతు ఖాళీ అయిపోయింది. గతంలో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇదిలా ఉంటే… లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలను నిల్వ చేసుకోడానికి కూడా జనం పోటీ పడ్డారు. దీంతో షాపుల్లోనూ రద్దీ కనిపించింది.