ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ పాముల నుంచి పాకిందట. అది కూడా ఆ వైరస్​కు మూలమైన చైనా సిటీ వుహాన్​ నుంచే మనుషుల్లోకి వచ్చిందట.

Update: 2020-01-24 03:29 GMT

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ పాముల నుంచి పాకిందట. అది కూడా ఆ వైరస్​కు మూలమైన చైనా సిటీ వుహాన్​ నుంచే మనుషుల్లోకి వచ్చిందట. చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. వుహాన్​లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్​ పాకిందని తెలుస్తోంది. కొత్త కరోనా వైరస్​ జీన్స్​ను పాత కరోనావైరస్​ జీన్స్​తో పోల్చి చూసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ వైరస్​ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. అంతేగాకుండా పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూసి, పాముల నుంచి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

మనుషులకు సోకడానికి ముందు పాముల్లోనే ఎక్కువగా ఆ వైరస్​ ఉండి ఉంటుందని...అన్ని ఫలితాలను పరిశీలించాక పాముల వల్లే ఈ కొత్త కరోనా వైరస్​ సోకి ఉంటుందని భావిస్తున్నారు సైంటిస్టులు. బీజింగ్​లోని చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ చేసిన స్టడీలోనూ ఈ విషయమే వెల్లడైంది. కొత్త కరోనా వైరస్​కు పాములు, గబ్బిలాలే కారణమని ఆ స్టడీ తేల్చింది. అయితే, పాములు లేదా గబ్బిలాల నుంచి ఆ వైరస్​ మనుషులకు ఎలా సోకిందో మాత్రం రెండు స్టడీలూ తేల్చలేదు. నిపుణులు మాత్రం వుహాన్​ సిటీలో చాలా మంది పాము మాంసం తింటారని, వాటిని తినడం వల్లే వైరస్​ సోకి ఉంటుందని చెబుతున్నారు.

జపాన్​, తైవాన్​, అమెరికా, హాంకాంగ్​, బ్రిటన్​, ఆస్ట్రేలియాకు పాకిన కొత్త వైరస్​, ఇప్పుడు మెక్సికో, కొలంబియాలకూ పాకింది. అక్కడ ఒక్కో వ్యక్తికి ఆ వైరస్​ సోకినట్టు గుర్తించారు. ఇక, వైరస్​ వల్ల ఇప్పటికే 17 మంది చనిపోయారు. 571 మంది దాకా దాని బారిన పడ్డారు. అయితే, వైద్యాధికారులు మాత్రం కేసులు పది వేలకు పైనే ఉంటాయని భావిస్తున్నారు. అంతేగాకుండా హెచ్​ఐవీ లాగానే ఈ కొత్త కరోనా వైరస్​కూ తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

మరోవైపు వైరస్​కు మూలకారణమైన వుహాన్​ సిటీకి రాకపోకలను చైనా బంద్​పెట్టింది. కోటి మందికిపైగా ఉండే వుహాన్​ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. రైళ్లు, బస్సులనూ ఆపేసింది. అన్నీ మూత పడటంతో రైల్వేస్టేషన్లు, ఎయిర్​పోర్టులు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. అంతేగాకుండా కేఫెలు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్​ సెంటర్లు, షాపింగ్​ మాళ్లన్నింటినీ మూసేశారు. వైరస్​ నేపథ్యంలో చైనాలో సర్జికల్​ మాస్కులు, గ్లోవ్స్​కు డిమాండ్​ బాగా పెరిగింది. కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికా సైంటిస్టులు. బేలర్​ కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన ట్రాపికల్​ మెడిసిన్​ రీసెర్చర్లు వ్యాక్సిన్​పై రీసెర్చ్​ చేస్తున్నారు.  

Tags:    

Similar News