BF.7 Variant: డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వూహాన్‌ వైరస్‌.. ఒకరి నుంచి 18 మందికి సోకే ప్రమాదం

BF.7 Variant: వూహాన్‌ వైరస్ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. మళ్లీ పంజా విసురుతోందనే భయం ప్రపంచ ప్రజలను వణికిస్తోంది.

Update: 2022-12-21 15:00 GMT

BF.7 Variant: డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వూహాన్‌ వైరస్‌.. ఒకరి నుంచి 18 మందికి సోకే ప్రమాదం

BF.7 Variant: వూహాన్‌ వైరస్ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. మళ్లీ పంజా విసురుతోందనే భయం ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో మరణ మృదంగం మోగిస్తోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రుల వద్ద భారీగా క్యూలు కడుతున్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనా దృశ్యాలు ఇప్పుడు చైనా అంతటా కనిపిస్తున్నాయి. కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లతో అల్లాడుతున్న చైనా నుంచి ముప్పు పొంచి ఉందని పలు దేశాలు టెన్షన్‌ పడుతున్నాయి. వ్యూహాన్‌ వైరస్‌తో ముప్పు పొంచి ఉందని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు శాస్త్రవేత్తలు, పరిశోధనల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నిజంగానే వైరస్‌ మళ్లీ విజృంభిస్తుందా? గత వేరియంట్ల కంటే.. చైనాలో విజృంభిస్తున్న వేరియంట్లు ప్రమాదకరమైనవా?

వూహాన్‌ ల్యాబ్‌లో పుట్టిన కరోనా మహమ్మారి.. సొంత దేశాన్ని మళ్లీ వణికిస్తోంది. ఈ వైరస్‌ చైనాతో ఆగదని.. మళ్లీ ప్రపంచంపై పంజా విసురుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. టీకాలతో లభించిన వ్యాధి నిరోధక శక్తిని కూడా నిర్వీర్యం చేసే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. జీరో కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో చైనాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా.. రోగులను పడుకోబెట్టేస్తున్నారు. తాజా చైనా పరిస్థితులపై అమెరికా కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ స్పందించారు. వచ్చే మూడు నెల్లలో చైనాలో 80 కోట్లమందికి పైగా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందన్నారు. వైరస్‌ బారిన పడి.. లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020 జనవరిలో వూహాన్‌ వైరస్‌ గురించి హెచ్చరించిన శాస్త్రవేత్తల్లో డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ ఒకరు. 2020లో వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. 35 నెలల్లో 60 కోట్ల కేసులు నమోదయ్యాయి. 60 లక్షల మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ 2020 నాటి పరిస్థితులు ప్రపంచ దేశాల్లో పునరావృతం అవుతాయని డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ వార్నింగ్స్‌ ఇస్తున్నారు. వైరస్‌ విస్పోటనం చెంది.. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ అంచనాలు ఒక్క డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్‌వే కాదు.. మరికొందరు శాస్త్రవేత్తలు కూడా ఇవే హెచ్చరికలను చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షలను ఎత్తి వేయడంతో.. 10 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని హాంక్‌కాంగ్‌ యూనివర్సిటీ అంచనా వేస్తోంది. వచ్చే 90 రోజుల్లో 80కోట్ల మందికి వైరస్‌ సోకే ముప్పు ఉందని యేల్‌ వర్సిటీ వెల్లడించింది.

చైనాలో వ్యాపిస్తున్న వైరస్‌తో కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లు వస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినట్టు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ, నివారణ సంస్థ-సీడీసీ ప్రకటించింది. అమెరికా వైద్య, ఆరోగ్య సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా వైరస్‌పై హెచ్చరికలను జారీ చేసింది. చైనాలోని కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైజ్‌ తెలిపారు. చైనాలోని కోవిడ్‌ వేవ్‌ ప్రతిచోటా పరివర్తనం చెంది.. ప్రమాదస్థాయిని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కోవిడ్‌ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా.. మృతదేహాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గత కొన్ని వారాలుగా కేవలం ఏడుగురు మాత్రమే చనిపోయినట్టు డ్రాగన్‌ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు స్మశాన వాటికలకు భారీగా మృతదేహాలతో కూడిన వాహనాలు భారీగా తరలివస్తున్నాయి. 24 గంటల పాటు దహన సంస్కారాలను నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబాలు నల్ల దుస్తుల్లో అంత్యక్రియలకు హాజరవుతున్నారు. అయితే ఎవరూ మరణాలపై మాత్రం స్పందించడం లేదు. తాజాగా చైనా కూడా విచిత్రమైన ప్రకటన చేసింది. కేసుల సంఖ్య భారీగా పడిపోయిందని.. కొత్తగా కేవలం కొన్ని కేసులే నమోదవుతున్నాయని తెలిపింది. చైనా నుంచి బయటకు వస్తున్న వీడియోలకు.. ప్రభుత్వ ప్రకటనలకు ఏ మాత్రం పొంతన లేకపోవడంపై ఆశ్చర్యపోనక్కర్లేదు. మొదటి నుంచి చైనా.. ఇదే విధానాన్నే అనుసరిస్తోంది.

మరోవైపు చైనా మెడికల్‌ షాపుల వద్ద.. డెలివరీ వర్కర్లు క్యూ కడుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఔషధాలను, కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో భారీగా ప్రజలు వైరస్‌ బారిన పడినట్టు స్పష్టమవుతోంది. కోవిడ్‌ ఆంక్షలను ఎత్తివేసిన తరువాత.. మెడిసిన్ డెలివరీలు భారీగా పెరిగాయని వర్కర్లు చెబుతున్నారు. మరోవైపు మెడికల్ స్టోర్లలో తగినన్ని మందులు లేవని వెల్లడిస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా భారీగా ఔషధాల కోసం మెడికల్‌ షాపులకు పరుగులు పెడుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. ఇలాంటి దృశ్యాలు చైనా అంతటా కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై చైనీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్త వేరియంట్లు సోకుతున్నాయని టెన్షన్‌ పడుతున్నారు. కానీ... ప్రభుత్వం మాత్ర అలాంటి అవకాశాలు లేవని బల్లాగుద్ది మరీ చెబుతోంది. తాజా మరణాలకు కోవిడ్‌ కారణం కాదంటూ డ్రాగన్‌ చెబుతోంది. కోవిడ్‌ సంక్రమించిన తరువాత.. శ్వాసకోస వైఫల్యంతోనే మరణిస్తున్నట్టు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో గుండెపోటు, ఇతర వ్యాధుల కారణంగానే పలువురు చనిపోతున్నారని డ్రాగన్ బుకాయిస్తోంది. అంతే తప్ప.. వైరస్‌తో ఎవరూ మృతి చెందడం లేదని తేల్చి చెబుతోంది. అయితే ఒకేసారి అంతమంది ఇతర వ్యాధులతో ఎలా చనిపోతున్నారో మాత్రం చైనా వెల్లడించడం లేదు. నిజానికి చైనా ఇలాంటి వివరాలను అస్సలు బయటికి చెప్పదు. మొదటి నుంచి కరోనా కేసుల విషయంలోనూ ఇలానే నాటకమాడింది. అసింటమాటిక్‌ కింద ఎక్కువ కేసులను చూపి.. లక్షణాలున్న కేసులు తక్కువగా చూపింది. అసలు మరణాలే లేవని వెల్లడించింది. కానీ అంతకుమించి మరణాలు సంభవించినట్టు రికార్డులు చెబుతున్నాయి.

బీజింగ్‌లో కోవిడ్‌ మృతుల అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా దోంగ్జే స్మశాన వాటికను కేటాయించింది. కొన్ని రోజులుగా మృతదేహాలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి, వేకువ జామున అనే తేడాలేకుండా అంత్యక్రియలను నిర్వమిస్తున్నారు. సాధారణంగా.. దోంగ్జే స్మశాన వాటికకు నిత్యం 30 నుంచి 40 మృతదేహాలు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 200కు పైగా వస్తున్నట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. స్మశాన వాటికలో పనిభారం పెరిగిందని.. తాము వైరస్‌ బారిన పడుతున్నామని.. అక్కడి సిబ్బంది వాపోతున్నారు. బీజింగ్‌లో దహన సంస్కారాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. మార్చురీల్లో ఓవర్‌లోడ్‌ పెరిగిపోయింది. 24 గంటలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నా.. 2వేలకు పైగా మృతదేహాలతో బంధువులు పడిగాపులు కాస్తున్నారట. ఇదిలా ఉంటే.. చైనాలో ఓమిక్రాన్ విజృంభిస్తోంది దీనికి సంబంధించిన కొత్త సబ్‌ వేరియంట్‌ BF.7 తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సామర్థ్యం ఉంది. ఇది ఇతర వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుంది. టీకాలను తీసుకున్న వారిలోని వ్యాధి నిరోధక శక్తిని కూడా నిర్వీర్యం చేయనున్నది. అంతేకాకుండా ఈ వైరస్‌ ఒకరికి సోకితే.. వారి నుంచి 18 మందికి సోకుతుందట. ఓమిక్రాన్‌ వేరియంట్‌ అయితే కేవలం ఐదు మందికి మాత్రమే సోకేది. BF.7 వేరియంటే ఇంత ప్రమాదకరంగా ఉంటే.. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లు మరింత ప్రమాదకరంగా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాను వణికిస్తున్న వూహాన్ వైరస్‌... ప్రపంచ దేశాలపై ఎలా దాడి చేస్తోందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి చైనా పొరుగున ఉన్న భారత్‌తో పాటు.. అమెరికా వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Tags:    

Similar News