చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా వైరస్.. లాక్‌డౌన్ విధింపు
* వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ * ఫుజియాన్ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్ * జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వ్యాప్తి
China: చైనాను మళ్లీ కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీలో ప్రమాదకర డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఒక్కరోజులోనే డెల్టా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రావిన్స్‌లో కట్టుదిట్టమైన ఆంక్షలతో పాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఇటీవల కాలంలోనే ఫుజియాన్ ప్రాంతంలో 152 కేసులు బయటపడగా అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, బార్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డెల్టా రకంతో పాటు, మరికొన్ని వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటంతో చైనా మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా బాధితులను కలిసిన వారిని గుర్తించడంపై దృష్టిపెట్టారు.