Coronavirus: చైనాను మరోసారి వెంటాడుతున్న కరోనా వైరస్
Coronavirus: డెల్టా వేరియంట్ కారణంగా పెరుగుతున్న కేసులు * వైరస్ వ్యాప్తి కట్టడికి చైనా కఠిన చర్యలు
Coronavirus: కరోనా పుట్టినిల్లు చైనాను వైరస్ మరోసారి వెంటాడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. తలుపుల ముందు ఇనుప రాడ్ల పెట్టి ఇంటిని సీల్ చేస్తున్నారు.
చైనా నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక రోజులో మూడు సార్లు మాత్రమే బయటకు రావాలి. అంతకంటే ఎక్కువ సార్లు బయటకు వచ్చినా పదే పదే తలుపులు తెరిచినట్లు ఫిర్యాదులు అందినా.. వెంటనే అధికారులు వారి ఇంటిని చేరుకుని బయటి నుంచి తాళాలు వేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇక అపార్ట్‌మెంట్లలో ఎవరికైనా కరోనా సోకినా లేదా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కాంటాక్ట్ పర్సన్ అని తేలినా.. ఆ భవనాన్ని రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తిగా సీల్ చేస్తున్నట్లు మరికొన్ని కథనాలు వెల్లడించాయి. అయితే చైనాలో ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడం కొత్త కాదు. గతేడాది వుహాన్ నగరంలో కరోనా విజృంభణ సమయంలోనూ ప్రజల ఇళ్లకు అధికారులు తాళాలు పెట్టి వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు.