శ్రీ లంక మాజీ ప్రధాని మహీందకు షాక్‌ ఇచ్చిన కొలంబో కోర్టు

Sri Lanka: మహింద రాజపక్సేతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేయాలని సీఐడీకి కొలంబో కోర్టు ఆదేశాలు

Update: 2022-05-14 08:30 GMT

శ్రీలంక మాజీ ప్రధాని మహీందకు షాక్‌ ఇచ్చిన కొలంబో కోర్టు

Sri Lanka: శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్సేకు కొలంబో కోర్టు షాక్ ఇచ్చింది. ప్రధాని నివాసం ఎదుట గల్లె ఫేస్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై తమ మద్దతుదారులను ఉసిగోల్పారన్న ఆరోపణలపై మహీందతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేయాలంటూ నేర పరిశోధన శాఖకు కొలంబో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 9న ఆందోళనకారులపై రాజపక్సే మద్దతుదారులు దాడులు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు తిరగబడ్డారు. రాజపక్సే మద్దతుదారులను వెంటబడి తరిమికొట్టారు. రాజపక్సేలతో పాటు పలువురు అధికార పార్టీ ఎంపీల ఇళ్లకు నిపు పెట్టారు. ఇరు వర్గాల హింసాత్మక ఘర్షణలతో లంక అట్టుడికింది. ఈ ఘర్షణల తరువాతే ప్రధాని పదవికి మహీంద రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత మహీంద కుటుంబం నావల్‌ బేస్‌లోని త్రిన్‌కోమలీకి వెళ్లిపోయింది.

మే 9న జరిగిన హింసాత్మక ఘటనలపై అటార్నీ జనరల్‌ సేనక పెరీరా కొలంబో పోర్ట్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మహీంద రాజపక్సేతో పాటు మరో ఆరుగురిని వెంటనే అరెస్టు చేయాలని నేర పరిశోధక శాఖ-సీఐడీకి న్యాయమూర్తి థిలిన గామేజీ ఆదేశాలు జారీ చేశారు. ఆమేరకు సీఐడీ రంగంలోకి దిగింది. మహీంద రాజపక్సేతో పాటు ఎంపీలు జాన్‌స్టోన్‌ ఫెర్నాండో, సంజీవ ఈదిరిమన్నే, సనత్‌ నిశాంత, మోరటువా మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన‌‌ సమన్‌లాల్‌ ఫెర్నాండో, సీనియర్‌ పోలీసు అధికారులు దేశబందు టెన్నకూన్‌, చందన విక్రమరత్నేలను సీఐడీ అరెస్టు చేయనున్నది. లంకలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 9 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. మూడుసార్లు ప్రధానిమంత్రిగా మహీంద రాజపక్సే ప్రభుత్వంలోని కీలకమైన 58 మంది నేతల ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రజలకు తినడానికి తిండి దొరకడం లేదు. ఇంట్లో ఉందామంటే కరెంటు లేదు బయటకు వెళ్దామంటే వాహనాలకు ఇంధనం దొరకడం లేదు అగ్గిపుల్ల నుంచి ఆహారం, సిమెంట్‌, పేపర్లు, ఇంధనం వరకు అన్నింటికీ ఆ దేశం దిగుమతులపైనే ఆధారపడింది. విదేశీ మారక నిధులు అడుగంటడంతో దిగుమతులు నిలచిపోయాయి. దీంతో భారీగా ఆహార సంక్షోభం తలెత్తడంతో ప్రజలు విలవిలలాడారు. దీనింతటికీ రాజపక్సేల కుటుంబమే కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ప్రధాని అధికార నివాసానికి సమీపంలోని గల్లే ఫేస్ వద్ద ప్రజలు శిబిరాలను ఏర్పాటు చేసుకుని నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. బ్రిటీష్‌వారి నుంచి స్వాతంత్రం పొందిన తరువాత అత్యంత దారుణమైన పరిస్థితులు లంకలో నెలకొన్నాయి.  

Tags:    

Similar News