Afghanistan: తాలిబన్- హక్కానీ నెట్‌వర్క్‌ మధ్య కోల్డ్‌వార్

Afghanistan: మార్పు దిశగా తాలిబన్ల అడుగులు * కరుడుగట్టిన ఇస్లాం రాజ్యమే హక్కానీ డిమాండ్

Update: 2021-09-06 04:51 GMT
పంజాషిర్ లో తాలీబన్లు మరియు దళాలు మధ్య యుద్ధం (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా అడుగులు వేస్తోందా..?. తాలిబన్లు తమ దేశం పేరును ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా నామకరణం చేసినా.. గ్రూపు తగాదాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారా..?. తాలిబన్లలో భాగమైన హక్కానీ నెట్‌వర్క్‌ అందుకు ప్రధాన కారణమా..?. హక్కానీ నెట్‌వర్క్‌ను పెంచిపోషించిన పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అందుకే కాబూల్‌కు చేరుకుందా..?. ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. నిజానికి తాలిబన్లు శుక్రవారం ప్రార్థనల తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా.. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. హక్కానీ నెట్‌వర్క్‌ నేతలు అందుకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ప్రభుత్వ ప్రకటనను తొలుత శనివారానికి.. ఆ తర్వాత ఒక వారం పాటు వాయిదా వేశారు.

శనివారం ప్రభుత్వ ఏర్పాట్లలో భాగంగా తాలిబన్లకు, హక్కానీ నెట్‌వర్క్‌ నేతలకు మధ్య జరిగిన చర్చలు ఘర్షణలకు దారితీశాయని.. దాడులు, ప్రతిదాడుల్లో బరాదర్‌ తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. తాలిబన్ల రెబెల్స్‌కు నాయకుడు, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్‌ నయీం దీన్ని పరోక్షంగా ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మార్టిన్‌ గ్రిఫిత్స్‌ బరాదర్‌తో భేటీ అయ్యారు. తమ సాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తూ ట్వీట్‌ చేశారు.

కొత్తగా ఏర్పడనున్న తాలిబన్ల ప్రభుత్వంలో రక్షణ శాఖతో పాటు పలు కీలక శాఖల కోసం హక్కానీ నెట్‌వర్క్‌ పట్టుబడుతోందని సమాచారం. ఖతార్‌ వేదికగా ఇప్పటికే భారత్‌ సహా.. పలు దేశాలతో చర్చలు జరిపిన షేక్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్థానెక్జాయ్‌ని విదేశాంగ మంత్రిగా, తాలిబన్లలో బాంబుల నిపుణుడిగా పేరున్న సదర్‌ ఇబ్రహీంను హోం మంత్రిగా, ముల్లా ఒమర్‌ తనయుడు ముల్లా మహమ్మద్‌ యాకూబ్‌కు కీలక శాఖ లేదా ప్రధాని పదవిని, తాలిబన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ను సమాచార మంత్రిగా నియమిస్తారని తెలిసింది. అఫ్ఘాన్‌ను చేజిక్కించుకోవడంలో తాలిబన్లతో కలిసి పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్‌ కూడా మంత్రివర్గంలో కీలక పదవులను ఆశిస్తోంది. ఈ వర్గంలో అమెరికాకు మోస్ట్‌వాంటెడ్‌ అయిన ఖలీల్‌ హక్కానీ, అతని సోదరుడి కుమారుడు సిరాజుద్దీన్‌ హక్కానీ, మరోనేత అనాస్‌ హక్కానీ ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని తమకే ఇవ్వాలని వీరు పట్టుబడుతున్నారని తెలిసింది.

అఫ్ఘాన్‌ మొత్తాన్ని ఆక్రమించినా.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌లో పాగా వేయకపోవడం పట్ల తాలిబన్లు రగిలిపోతున్నారు. హక్కానీ నెట్‌వర్క్‌ పంజ్‌షీర్‌ రెబెల్స్‌పై యుద్ధంలో యాక్టివ్‌గా ఉంది. శనివారం కాబూల్‌ చేరిన ఐఎస్‌ఐ చీఫ్‌ వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమతో పోరాడుతున్న 700 మంది తాలిబన్లను తుదముట్టించామని, మరో వెయ్యి మందిని నిర్బంధించామని పంజ్‌షీర్‌ రెబెల్స్‌ నేత మసూద్‌, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించారు. బరాదర్‌ కూడా శాంతిని కోరుకుంటున్నారని, తాలిబన్లను వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలిచ్చారని సలేహ్‌ గుర్తుచేశారు. కానీ, ఐఎస్‌ఐ ప్రేరేపిత పోరు కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల అరాచకాలను ఊహించిన 10 వేల మంది అఫ్ఘాన్లు పంజ్‌షీర్‌ చేరుకున్నారు. 

Tags:    

Similar News