దూసుకొస్తున్న డ్రాగన్ ఫెయిల్యూర్ రాకెట్.. 25 టన్నుల రాకెట్ ఎక్కడ కూలబోతోంది?
Long March 5B Rocket: ఫెయిల్యూర్ మిషన్.. డ్రాగన్ కంట్రీ చైనాకు ఈ మాట కొత్తేం కాదు.
Long March 5B Rocket: ఫెయిల్యూర్ మిషన్.. డ్రాగన్ కంట్రీ చైనాకు ఈ మాట కొత్తేం కాదు. చైనా అంతరిక్ష పరిశోధనల్లో గతంలో ఫెయిల్యూర్ మిషన్స్ జనావాసాలపై కుప్పకూలాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ముప్పే రిపీట్ కాబోతోందన్న అంచనాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎక్కడ పడుతుందో, ఏం జరుగుతుందో అంచనా వేయడం కూడా కష్టమే అన్న వార్తలతో యావత్ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 25 టన్నులు.. అక్షరాలా 25 టన్నుల బరువున్న భారీ బూస్టర్ కూడా ఫెయిల్యూర్ రాకెట్‌లో ఉండడమే ఇందుకు కారణం. ఇంతకూ, డ్రాగన్ కంట్రీ ఫెయిల్యూర్ మిషన్‌తో రాబోతున్న ముప్పేంటి..? 25 టన్నుల బరువు ఒక్కసారిగా భూమిని తాకితే ఏం జరుగుతుంది..?
ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగురుతా అన్నట్టుంది డ్రాగన్ కంట్రీ చైనా తీరు. ప్రయోగం చేయడం వరకూ ఓకే ఆ ప్రయోగం విఫలమైతేనే చైనా సైంటిస్టుల టాలెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది. రీసెంట్‌గా అంతరిక్ష కేంద్రం కోసం వేగంగా అడుగులేస్తున్న జిన్‌పింగ్ సర్కార్ అందులో భాగంగానే లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ను ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ఫస్ట్ ల్యాబ్ మాడ్యూల్‌ను స్పేస్‌లోకి విజయవంతంగా తీసుకెళ్లింది. అయితే ఈ మిషన్ మాత్రం పూర్తిగా విజవంతం కాలేదు. ఫస్ట్ ల్యాబ్ మాడ్యూల్‌ను తీసుకెళ్లిన రాకెట్ ఇప్పుడు డ్రాగన్ సైంటిస్టుల మాట వినకపోవడమే ఇందుక్కారణం. ఫస్ట్ ల్యాబ్ మాడ్యూల్స్‌ను లక్ష్యాలకు చేర్చిన తర్వాత రాకెట్ ఔట్ ఆఫ్ కంట్రోల్‌లోకి వెళ్లింది. ఇంకేముంది అడ్డూ అదుపూ లేని వేగంతో తిరిగి భూమివైపు దూసుకొస్తోంది. జులై 31న ఏ క్షణమైనా భూమీని ఢీకొట్టొచ్చన్న ఏరోస్పేస్ కార్పొరేషన్ హెచ్చరికలతో ప్రపంచం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇందులో మరింత భయపెట్టే వార్త ఏంటంటే భూమిని ఢీకొట్టబోతున్న డేంజర్ రాకెట్‌లో అక్షరాలా 25.4 టన్నుల బరువుండే భారీ బూస్టర్ కూడా ఉండడమే. ఇంత బరువైన రాకెట్ బూస్టర్ భూమిని ఢీకొడితే జరిగే విధ్వంసం అంతా ఇంతా కాదంటున్నారు స్పేస్ ఎక్స్‌పర్ట్స్. ఇంతకూ, డ్రాగన్ కంట్రీ ఫెయిల్యూర్ రాకెట్‌తో భారత్‌కు ముప్పుందా..?
భూమివైపు వేగంగా దూసుకొస్తున్న చైనా లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ఎక్కడ కూలుతుందనే దానిపై శాస్త్రవేత్తలు పలు అంచనాలు వేస్తున్నారు. రాకెట్ కూలబోయే అవకాశాలున్న దేశాల లిస్టులో భారత్ కూడా ఉంది. ఏరోస్పేస్ కార్పొరేషన్ చెబుతున్న దాని ప్రకారం త్వరలోనే చైనా రాకెట్ శకలాలు భూమి దిగువ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. అమెరికాతోపాటు భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో, ఆఫ్రికా, బ్రెజిల్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా కుప్పకూలే అవకాశం ఉంది. ఇండియా లాంటి దేశంలో రాకెట్ శకలాలు జనావాసలపై పడితే భారీ విధ్వంసం తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి రాకెట్ ప్రయోగాల తర్వాత అవి ఔట్ ఆఫ్ కంట్రోల్‌లోకి వెళ్లినా ఎక్కువగా సముద్రంలోనే కూలేలా ఏర్పాట్లు చేస్తారు. కానీ, చైనా ఫెయిల్యూర్ మిషన్లలో మాత్రం రాకెట్ శకలాలు జనావాసాల్లో పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకూ చైనా రాకెట్లు జనావాసాల్లో కూలిన ఘటనల్లో వందలాది మంది మరణించారు. వీటన్నింటికీ కారణం డ్రాగన్ కంట్రీ నిర్లక్ష్యపు వైఖరే అని నాసా సైతం గతంలోనే బహిరంగంగా విమర్శించింది.
నిజానికి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఏరోస్పేస్ కార్పొరేషన్ సంస్థ అంతరిక్షంలో తిరుగాడుతున్న ఉప గ్రహాలు, రాకెట్ల భాగాలు, ఇతర వస్తువులను నిత్యం పరిశీలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో చాలా సార్లు భూమిపై తిరిగి పడిపోబోయే ఉప గ్రహాలు, రాకెట్ భాగాలను గుర్తించి హెచ్చరించింది కూడా. 2021లో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో భాగంగానే లాంగ్ మార్చ్ 5బి రాకెట్‌ను ప్రయోగించింది. ఆ సమయంలో మాడ్యూల్‌ను కక్షలోకి ప్రవేశపెట్టిన అనంతరం భూమిపై ఉన్న కంట్రోల్ రూమ్‌తో లాంచింగ్ వెహికల్‌కు సంబంధాలు తెగిపోయాయి. అనంతరం 23 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది. రాకెట్ శకలాలు ఆసియా ఖండంలో పడతాయన్న అంచనాలతో భారత్ సహా ఇతర ఆసియా దేశాలు కంటిమీద కునుకులేకుండా గడిపాయి. అయితే, చైనా మాత్రం ఆందోళన అవసరంలేదని, రాకెట్ శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా మండిపోతాయని నిర్లక్ష్యపు సమాధానం చెప్పింది. చివరికి భారత్ పొరుగు దేశం మాల్దీవుల సమీపంలో సముద్రంలో కూలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అవే రాకెట్ శకలాలు జనావాసాలపై పడి ఉంటే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగుండేది. ఆ సమయంలో 21 టన్నుల చైనా రాకెట్ భూమిని ఢీకొట్టబోతోందని హెచ్చరించింది కూడా ఏరోస్పేస్ కార్పొరేషనే.
చైనా ఫెయిల్యూర్ మిషన్లలో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. 2021కి ముందే లాంగ్‌మార్చ్ బీ శ్రేణి రాకెట్‌ను చైనా ప్రయోగించగా ఐవరీ కోస్ట్‌లోని జనావాసాలపై కూలి బీభత్సం సృష్టించింది. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. ఆరోజు ఐవరీ కోస్ట్‌పై లోహపు ముక్కల వర్షం కురిసింది. ఆస్తి నష్టమే తప్ప అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. అలాగే, 2019 నవంబర్‌లో జిచాంగ్ ప్రయోగ వేదిక నుంచి ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు లాంగ్‌మార్చ్ 3బీ రాకెట్‌ను ప్రయోగించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే సిచువాన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంపై రాకెట్ శకలాలు కుప్ప కూలాయి. ఆనాటి ఈ ఘటనను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా యధావిధిగా ఆ వీడియోలు, ఫొటోలను చైనా ప్రభుత్వం తొలగించింది. ఇక 1996 ఫిబ్రవరి 15న లాంగ్‌మార్చ్ 3బీ శ్రేణి రాకెట్‌ను డ్రాగన్ ప్రయోగించింది. ఇది సమీపంలోని మైలిన్ అనే గ్రామంపై పడి పదులసంఖ్యలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, చైనా మాత్రం ఆరుగురు చనిపోయారనీ, 57మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా మాత్రం కనీసం 200 మంది చనిపోయినట్లు పేర్కొంది.
మరోవైపు 2021లో దూసుకొచ్చిన రాకెట్ శకలాల బరువు 21 టన్నులు కాగా ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్ప అక్షరాలా 25.4 టన్నులు. గతంలో జరిగినట్టే ఇది కూడా సముద్రంలోనో జనావాసాలు లేని చోటో కూలితే నష్టం లేదు కానీ, అలా కాకపోతనే అసలు సమస్య అంతా. ఇంత బరువున్న రాకెట్ శకలాలు జనావాసాల్లో కూలితే భారీగా ప్రాణ నష్టం జరిగితీరక మానదు. ఒకవేళ సముద్రంలో నేరుగా కూలిందనుకున్నా 25 టన్నుల బరువు ఒకేసారి పడితే చిన్నపాటి సునామీలా ఉప్పొంగే అవకాశమూ లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరే తియాంగాంగ్ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయోగాలకు చెందిన రాకెట్లే చైనా సైంటిస్టుల మాట వినని పరిస్థితి. మరి ఆ అంతరిక్ష కేంద్రం కూడా అదుపు తప్పితే..? మరో స్కైలాబ్ కావడం ఖాయమా..? తాజా ఉపద్రవంతో ఇప్పుడు వినిపిస్తున్నది ఇలాంటి ప్రశ్నలే. దీనికితోడు గతంలో మాదిరిగానే తమపై కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని, రాకెట్ శకలాలతో అసలు ప్రమాదమే లేదనే నిర్లక్ష్యపు సమాధానాలే డ్రాగన్ కంట్రీ మళ్లీ చెబుతోంది. దీంతో చైనా తీరు మరోసారి టెన్షన్ పెట్టేదిగానే కనిపిస్తోంది.
అంతరిక్షంపై ఆదిపత్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జిన్‌పింగ్ తియాంగాంగ్ నిర్మాణం కోసం అంతే వేగంగా అడుగులేయడం ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. ఈ ఏడాది చివరికల్లా తియాంగాంగ్ పూర్తి చేసి తీరాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఇందులో భాగంగానే వరుస ప్రయోగాలు చేపడుతోంది. వీటిల్లో రెండు లాంగ్ మార్చ్ రాకెట్లు ఔట్ ఆఫ్ కంట్రోల్‌లోకి వెళ్లగా పలు ప్రయోగాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తియాంగాంగ్ నిర్మాణంలో కూడా ఏదైనా తేడా వస్తే ప్రపంచానికి భారీ ముప్పు పొంచి ఉన్నట్టే. దీంతో నాసా సహా ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు తియాంగాంగ్ నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తున్నారు. మొత్తంగా డ్రాగన్ కంట్రీ ఫెయిల్యూర్ రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ భూమిపై ఎలాంటి విధ్వంసానికి వేదికవుతుందో చూడాలి.