World War 3: వరల్డ్ వార్‌పై బాంబు పేల్చిన యూకే ఆర్మీ చీఫ్.. భారత్‌కు తప్పని చైనా యుద్ధ ముప్పు
China Will Start Third World War?: 2027లో తైవాన్ ఆక్రమణకు దిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు. యూకే ఆర్మీ చీఫ్ కూడా అదే సమయాన్ని సూచిస్తున్నారు. 2027లో చైనా ప్రపంచ యుద్ధానికి దిగుతుందని అంచనా వేస్తున్నారు.
World War 3: ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి మూడో ప్రపంచ యుద్ధం భయాలు మొదలయ్యాయి. పుతిన్ చేతిలో ఉన్న అణుబాంబు మీటను ఎప్పుడు నొక్కుతారోనని యూరోప్ బిక్కుబిక్కుమంటోంది. అయితే రష్యా నుంచి మూడో ప్రపంచ యుద్ధ భయం లేదని తాజాగా బ్రిటన్ కొత్త ఆర్మీ చీఫ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. చేస్తున్న యుద్ధాన్నే పుతిన్ ఆపేస్తారని అంచనా వేశారు. అయితే మరో దేశంతోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. దానికి తోడుగా రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ కలిసి వస్తాయని హెచ్చరించారు. మూడేళ్లలో బ్రిటన్ సైన్యం యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిజంగానే ప్రపంచ యుద్ధం వస్తుందా? బ్రిటన్ సైనిక చీఫ్ చెప్పింది నిజమవుతుందా? ఇంతకు ఏ దేశంతో మూడో ప్రపంచ యుద్ధం రానుంది? ఈ విషయంలో భారత్‌కు కూడా ఆందోళన తప్పదా?
మూడో ప్రపంచ యుద్ధం అనివార్యంగా మారిందా?. ప్రస్తుతం ప్రపంచంలో రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి. 2022 ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టింది. 2023 అక్టోబరు 8 నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఈ రెండు యుద్ధాలు తీవ్రమైన ప్రతిసారీ ప్రపంచ యుద్ధం ప్రస్తావన వస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలపై అణుదాడికి దిగుతారని.. దీంతో ప్రపంచ యుద్ధం వస్తుందన్న ఆందోళనలు రెండేళ్లుగా ఉన్నాయి. అయితే ప్రపంచ యుద్ధం రష్యా నుంచో, ఇజ్రాయెల్ నుంచో రాదని బ్రిటిష్ ఆర్మీ చీఫ్ చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన యుద్ధం మరొక దేశం నుంచి రానున్నట్టు చెబుతున్నారు. వచ్చే మూడేళ్లలో యుద్ధానికి యూకే సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ఏ దేశం నుంచి ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉంది? అంటే.. డ్రాగన్ కంట్రీ నుంచేనని చెబుతున్నారు. ఇరాన్, రష్యా, ఉత్తర కొరియాను కలుపుకుని ప్రపంచంపై చైనా యుద్ధానికి దిగనుందని బ్రిటన్ ఆర్మీ చీఫ్ జనరల్ సర్ రోలీ వాకర్ వివరిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ అణ్వస్త్రాలున్న దేశం. అంతేకాదు.. యూఎన్ భద్రతా మండలిలో సభ్యదేశం. ఆ దేశ సైన్యం మూడేళ్లలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్స్ ఇస్తున్నారు. నిజంగా బ్రిటన్ యుద్ధ ఘంటికలను మోగిస్తుందా? యూకే ఆర్మీ చీఫ్ చెప్పింది ఎంత వరకు నిజం? ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందేనా? చైనా యుద్ధానికి దిగితే.. భారత్ పరిస్థితి ఏమిటి?
తాజాగా బ్రిటన్ వార్షిక మిలటరీ సమావేశం ఈనెల 21న విలేకరులతో కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ముచ్చటించారు. అత్యంత ప్రమాదకరమైన ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినర్ తప్పుకుంటారని అంచనా వేశారు. అయితే ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించే అమెరికా, యూకే లాంటి దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని పుతిన్ భావించే అవకాశం ఉందని తెలిపారు. అయితే మాస్కో యుద్ధంలో ఓడిపోతుందా? గెలుస్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. అయితే రష్యా కంటే డ్రాగన్ కంట్రీ నుంచే ప్రమాదం పొంచి ఉందని వాకర్ హెచ్చరిస్తున్నాడు. అయితే వాకర్ ఎందుకు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? మనం దక్షిణ చైనా సముద్రానికి వెళ్లాల్సిందే. ఈ సముద్రంలోని ద్వీప దేశం తైవాన్‌ను సొంతం చేసుకోవాలని డ్రాగన్ దేశాధినేత కలలు కంటున్నారు. శాంతియుతంగా చైనాలో తైవాన్‌ను విలీనం చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచిస్తున్నాడు. ఒకవేళ అందుకు అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ చుట్టూ బీజింగ్ పెద్ద ఎత్తున యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. నిత్యం భారీగా సైనిక విన్యాసాలను చేపడుతోంది. అయితే ఇప్పటికిప్పుడు తైవాన్‌పై చైనా దాడి చేయదని నిపుణులు చెబుతున్నారు. 2027లో తైవాన్ ఆక్రమణకు దిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు. యూకే ఆర్మీ చీఫ్ కూడా అదే సమయాన్ని సూచిస్తున్నారు. 2027లో చైనా ప్రపంచ యుద్ధానికి దిగుతుందని అంచనా వేస్తున్నారు.
2027 నాటికి బ్రిటిష్ దళాలు యుద్ధానికి పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని వాకర్ హెచ్చరించారు. నిజానికి కేవలం తైవాన్ విలీనానికి మాత్రమే జిన్‌పింగ్ పరిమితం అవ్వడం లేదు. ఫిలిప్పైన్స్‌పై కూడా కన్నేశాడు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలోని ఇరుదేశాల ఘర్షణకు వివాదాస్పద సబీనా షోల్ కీలకంగా మారింది. మూడో ప్రపంచ యుద్ధం చైనా నుంచే మొదలవుతుందన్న యూకే ఆర్మీ చీఫ్ వేస్తున్నారు. వాస్తవానికి చైనా నుంచి తీవ్రమైన ముప్పు ఉందని తైవాన్, ఫిలిప్పైన్స్ ఆందోళనకు గురవుతున్నాయి. అదే సమయంలో జిన్‌పింగ్ సైతం తన ఆశయాలను బహిరంగంగానే చెప్తున్నారు. 9డాష్ లైన్‌ను నిజం చేయాలని చైనా అధ్యక్షుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. నైన్ డాష్ లైన్ అంటే.. దక్షిన చైనా సముద్రం మొత్తం తమదేనని.. అందులో దీవులు తమవే అని బీజింగ్ చేసే వాదనలే. అయితే చైనా ఆక్రమణలకు దిగడానికి అక్కడ ఉన్నది మింగ్ రాజవంశం ఏ మాత్రం కాదు. చక్రవర్తులు, ఆక్రమణదారులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆధునిక కాలంలో వ్యూహాత్మ ఆలోచనాపరుడైన దేశాధినేత యుద్ధాన్ని ఏ మాత్రం కోరుకోడు. సంఘర్షణల పరిష్కారానికి దౌత్య మార్గాన్నే ఎంచుకుంటారు. అయితే జిన్‌పింగ్ మాత్రం విస్తరణవాదంతోనే రెచ్చిపోతున్నారు. దౌత్యానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో చైనాను ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉండాలని యూకే మిలటరీ చీఫ్ పిలుపునిస్తున్నారు. భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనాలంటే.. సైన్యం తన పోరాట శక్తిని తక్షణమే పునర్నిర్మించుకోవాల్సిన అవసరాన్ని వాకర్ ఎత్తి చూపారు.
కాలం చెల్లిన యుద్ధ విధానాలు, ఆలోచనలను వదిలేయాలన్నారు. కొత్త టెక్నాలజీతో యుద్ధ భూమిని పూర్తిగా మార్చేయాలని సైన్యానికి సూచించారు. స్వయం ప్రతిపత్తి ఆయధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీకి వినియోగించాలని సైన్యాన్ని కోరారు. సమర్థవంతమైన ఆర్మీని సిద్ధం చేయాల్సిన ఆవశ్యకతను వాకర్ నొక్కి చెప్పారు. లేదంటే.. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలను ఎదుర్కొనడం అసాధ్యమని తేల్చి చెప్పారు. అది కూడా 2027 నాటికి ఆర్మీన సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని స్పష్టం చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి శత్రుదళాల కంటే మూడు రెట్లు శక్తివంతంగా యూకే9 ఆర్మీని మార్చడమే లక్ష్యమని చెప్పారు. అయితే యూకే ప్రధాని స్టార్మర్ రక్షణ బడ్జెట్‌ను పెంచుతామని చెప్పారు. గతంలో దేశ జీడీపీలో 2 శాతం రక్షణ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు దాన్ని 2.5 శాతానికి పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ పెంపు చాలా తక్కువ అని.. అది ఏమాత్రం ఆర్మీకి సహకరించదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఎక్కువ దళాలు, భారీగా నిధులు లేకుండా పరిమిత వనరులతో యూకే యుద్ధం చేయగలదా? అంటే.. నో అనే చెబుతున్నారు నిపుణులు. నిజానికి పాశ్చాత్య దేశాలు రక్షణ విషయంలో చాలా వరకు ఒకదానిపై మరొక కంట్రీ ఆధారపడుతున్నాయి. 8 లక్షల మంది సైనికులు, 2లక్షల వాహనాలు పశ్చిమ దేశాల వద్ద ఉన్నాయి. యుద్ధం వస్తే.. 3 నుంచి 6 నెలల కాలానికి సరిపడా ఆయుధాలు నాటో కూటమి వద్ద ఉన్నాయి.
ఆధునిక యుద్ధాలను చేసేందుకు భూ, నేవీ, వైమానిక, సైబర్ దాడుల నిర్వహణకు లక్షల మంది సైన్యం అవసరమని వాషింగ్టన్‌లోని నాటో శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించారు. భారీ యుద్ధం జరిగినప్పుడు సైన్యాన్ని వెంటనే తరలించేందుకు ఇది మేలు చేస్తుందని నాటో విశ్వసిస్తోంది. అయితే ప్రస్తుతానికి 5 లక్షల మంది సైనికులు సిద్ధంగా ఉన్నారని ఈ సదస్సులో నాటో వెల్లడించింది. అయితే ప్రస్తుతం యుద్ధాలను ఎదుర్కొనేందుకు ఆ సైన్యం సరిపోతుందా? సరిపోదనే నిపుణులు చెబుతున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరికపై గత నెలలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను చేర్చుకుంటే ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. మార్చిలో పుతిన్ సైతం ఇలాంటి హెచ్చరికలే చేశారు. నాటో, రష్యా మధ్య యుద్ధం అంటే.. అది మూడో ప్రపంచ యుద్ధమేనని పుతిన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. తైవాన్, ఫిలిప్పైన్స్‌తో చైనా సరిపెట్టుకోవడం లేదు. భారత్‌లోని పలు భూభాగాలపైనా కన్నేసింది. భారీగా సరిహద్దులో మౌలిక వసతులను పెంచుతోంది. ఈ విషయాన్ని భారత్ గుర్తించింది. అందుకే దేశ రక్షణకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల 93వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈసారి దీన్ని 4.79 శాతం పెంచింది. 2024-25 బడ్జెట్‌లో 6 లక్షల 21వేల కోట్ల రూపాలయను కేటాయించింది. పెద్ద ఎత్తున సరిహద్దుల్లోకి సైన్యాన్యి, ఆయుధాలను తరలిస్తోంది. అగ్రి, బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగాలను ముమ్మరం చేసింది.
చైనాతో యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సిద్ధమవుతోంది. చైనా వేసే ఎత్తులకు భారత్ పైఎత్తులు వేస్తోంది. నిజానికి రష్యా, చైనా, దక్షిణ కొరియా, ఇరాన్ దేశాలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏ యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో చాలా దేశాలు ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. యుద్ధమే వస్తే.. ఉక్రెయిన్‌లా ధైన్యమైన పరిస్థితిని రాకుండా అప్రమత్తమవుతున్నాయి.