అమెరికాలో పడగ విప్పుతున్న గన్‌ కల్చర్‌.. తల్లిని గన్‌తో కాల్చిన మూడేళ్ల చిన్నారి..

Gun Violence: ఓ చిన్నారికి అనుకోకుండా తుపాకీ దొరికింది.

Update: 2022-09-24 14:45 GMT

అమెరికాలో పడగ విప్పుతున్న గన్‌ కల్చర్‌.. తల్లిని గన్‌తో కాల్చిన మూడేళ్ల చిన్నారి..

Gun Violence: ఓ చిన్నారికి అనుకోకుండా తుపాకీ దొరికింది. ఆ తుపాకీతో ఆడుకోవడం మొదలుపెట్టాడు అంతలోపు చిన్నోడి చేతిలో తుపాకీని తల్లి గమనించింది. అది బొమ్మ తుపాకీ కాదని లాక్కునేందుకు ప్రయత్నించింది. ఆ చిన్నారి తుపాకీని ఇవ్వకుండా.. డుష్యూం.. డుష్యూం.. అంటూ తల్లిపై కాల్పులు జరిపాడు. అది పేలుతుందని తెలియని చిన్నారి ప్రమాదవశాత్తు తల్లిని చంపేశాడు. ఇదేదో సినిమాలో దృశ్యం అస్సలు కాదు అమెరికాలో తాజాగా జరిగిన ఓ ఘటన అగ్రదేశాన్ని పట్టి పీడిస్తున్న గన్‌ కల్చర్‌ భూతానికి ప్రత్యక్ష నిదర్శనం గన్‌ కంట్రోల్‌ చట్టాన్ని కఠినతరం చేయాలని అక్కడి ప్రజలు నెత్తీనోరూ బాదుకున్నా.. అక్కడి ప్రజా ప్రతినిధులు మాత్రం తమ స్వార్థమే చూసుకుంటున్నారు. గన్ అమెరికన్ హక్కుగా నీతులు వల్లిస్తున్నారు.

అమెరికాలో మూడేళ్ల చిన్నారి తల్లిని గన్‌తో కాల్చేశాడు. అభంశుభం తెలియని చిన్నారి చేతిలో తల్లి ప్రాణాలను కోల్పోయిన ఈ ఘటన అగ్రరాజ్యం గన్ కల్చర్‌ భూతానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందంటే అనుకోకుండా చిన్నారి చేతికి గన్‌ దొరికింది. దానితో చిన్నారి ఆడుకోవడం తల్లి గమనించింది. వెంటనే అప్రమత్తమై చిన్నారి నుంచి గన్‌ను లాక్కునేందుకు యత్నించింది. అయితే చిన్నారి గన్‌ను ఇ్వవకుండా తల్లిపై గన్‌ను గురిపెట్టి తెలియకుండానే కాల్చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ తల్లి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సౌత్‌ కరోలినా రాష్ట్రంలోని స్పార్టన్‌బర్గ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో చనిపోయిన తల్లి పేరు కోరా లిన్ బుష్‌. విషాదకరమైన విషయమేమిటంటే ఈ ఏడాది ఇప్పటివరకు ఇలా చిన్నారులు అనుకోకుండా జరిపిన ఘటనలు 194 నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 82 మంది మృతి చెందారు. 123 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

అమెరికన్లు ఆయుధాల పట్ల ఆకర్షితులవుతున్నారు. గన్‌ కలిగి ఉండడం ఓ ఫ్యాషన్‌గా అక్కడి వారు భావిస్తున్నారు. ఎంతలా అంటే మన దేశంలో ప్రతి ఒక్కరి వద్ద ఓ మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్టుగా అమెరికన్లు గన్‌పై అంత ఆసక్తి చూపుతున్నారు. నిజానికి వారికి సెల్‌ఫోన్‌ కంటే గన్నే ముఖ్యమని అనుకునేలా అమెరికాలో పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి 100 మంది అమెరికన్ల వద్ద 120 తుపాకులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మన దేశంలో మొబైల్‌ ఫోన్లను ఎంత ఈజీగా కొనుగోలు చేయవచ్చో అమెరికాలో గన్‌లు కూడా అంత ఈజీగా దొరుకుతాయి. అమెరికాలో గతంలో కంటే తుపాకుల వ్యాపారం భారీగా పెరిగింది. 2000 నుంచి రెండు దశాబ్దాలుగా 13 కోట్ల 90వేల తుపాకులు ఉత్పత్తయ్యాయి. మరో 7 కోట్ల 10 లక్షల గన్నులు దిగుమతయ్యాయి. 2020లో కోటి 35 లక్షల గన్నులు, 2021లో 2 కోట్ల 20 లక్షల గన్నులు విక్రయమయ్యాయి. ఇందులో అత్యాధునిక రైఫిళ్లు కూడా ఉన్నాయి. గన్నుల ధరలు 100 డాలర్ల నుంచి లభిస్తున్నాయి. అంటే మన రూపాయల్లో చెప్పుకుంటే 7వేలపైగా పెడితే చాలు గన్ను దొరుకుతుంది.

ఇక తుపాకుల నియంత్రణ చట్టం ప్రకారం.. 18 ఏళ్ల పైబడిన ఎవరైనా గన్నును పొందవచ్చు. ఎలాంటి నేర చరిత్ర, మానసిక సమస్యలు ఉండరాదని చట్టం చెబుతోంది. మన దేశంలో ప్రతి వ్యక్తి వద్ద ఓ సెల్‌ఫోన్‌ ఉన్నట్టే అమెరికాలో ప్రతి వ్యక్తి వద్ద ఓ గన్‌ ఉంటుంది. తుపాకులపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో గన్‌ కల్చర్‌ మరణాలు ఏటా పెరుగుతున్నాయి. 2020 ప్రకారం 19వేల 350మంది తుపాకీ తూటాలకు బలయ్యారు. 2019లో కంటే 35 శాతం పెరిగింది. ఇక 2020లో 24వేల 245 మంది తుపాకీలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019 కంటే 1.5 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. 2009 నుంచి అమెరికాలో 274 సామూహిక కాల్పులు జరిగాయి. ఫలితంగా 15వందల 36 మంది తూటాలకు బలయ్యారు. 983 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని 52 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. తుపాకుల నియంత్రణకు 91 శాతం డెమొక్రాట్లు మద్దతు ఇస్తుంటే రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

స్పార్టన్‌బర్గ్‌ ఘటనతో అమెరికాలో గన్‌ కల్చర్‌ ఎంత ప్రమాదకరంగా మారిందో ఇట్టే చెప్పొచ్చు. అగ్రరాజ్యం అమెరికా ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా వ్యవహరిస్తూ పక్క దేశాల మధ్య సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంది. కానీ తమ దేశంలో ప్రజాస్వామానికి అతి పెద్ద సమస్యగా మారిన గన్ కల్చర్‌పై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి పరిష్కార మార్గం చూపలేక చతికిలపడుతోంది. దేశంలో రోజురోజుకు తుపాకీ సంస్కృతి కారణంగా ఎందరో తూటాలకు బలైపోతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా బైడెన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అమెరికా ప్రజలను మరింత ఆందోళనల్లోకి నెడుతోంది. టెక్సాస్‌ స్కూల్‌లో 19 మంది చిన్నారులు, ముగ్గురు పాఠశాల సిబ్బందిపై కాల్పులు జరిగిన ఘటనతో గన్‌ కల్చర్‌పై అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. గన్ కంట్రోల్‌ చట్టాన్ని కఠినతరం చేయాలంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో ఏదో హడావిడిగా చట్టాలు తీసుకొస్తున్నట్టు బైడెన్‌ సర్కారు ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం వైఫల్యం చెందింది. నిత్యం తూపాకులు గర్జిస్తున్నా మౌనంగా చూస్తుండిపోయింది. కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

గన్‌ కంట్రోల్‌ వ్యవహారం రాజకీయ విమర్శలతో పక్కదారిపడుతోంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నేతలు గన్‌ కల్చర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. డెమోక్రాట్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పలువురు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్-ఎన్‌ఆర్‌ఏలో సభ్యులు. పైగా ఆయుధ తయారీ కంపెనీల్లోనూ వారికి భారీగా వాటాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుపాకీ నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేయకుండా సెనేట్‌లో ఎన్‌ఆర్‌ఏ సభ్యులైన రిపబ్లికన్లు అడ్డుకుంటున్నారు. రిపబ్లికన్‌ తీరుపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తప్ప మరేదేశంలోనూ విచ్చలవిడి కాల్పుల ఘటనలు జరగవని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తుపాకీ సంస్కృతిని అడ్డుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. అధ్యక్షుడు బైడెన్‌ గన్ కంట్రోల్‌ చట్టానికి మార్పులు తెచ్చారు. భారీగా నిరసనలు హోరెత్తుతున్నా రిపబ్లికన్లు మాత్రం పట్టు వీడడం లేదు. గన్‌ కల్చర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినా అక్కడి ప్రజా ప్రతినిధుల్లో మాత్రం మార్పు రాలేదు. గన్‌ కంట్రోల్‌ చట్టాన్ని కొంతవరకు మార్పులు చేసినా వాటి అమలులో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో గన్‌ కల్చర్‌ భూతం మరింతగా విజృంభిస్తోంది.

Tags:    

Similar News