Charles III: పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న బ్రిటన్.. కిరీటం వెనుక ఉన్న అసలు కథ ఇదీ..!
King Charles III's Coronation: బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్3 మరికొన్ని గంటల్లో ప్రమాణం చేయనున్నారు.
King Charles III's Coronation: బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్3 మరికొన్ని గంటల్లో ప్రమాణం చేయనున్నారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ ను పాలించిన రాణి ఎలిజిబెత్ 2 గతేడాది సెప్టెంబర్ లో మరణించడంతో తదుపరి రాజుగా ఛార్లెస్ 3 బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారికంగా రాజుగా బాధ్యతలు చేపట్టినా..సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం మాత్రం మే 6న జరగనుంది.
ఛార్లెస్3 పట్టాభిషేక మహోత్సవాన్ని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రూ.1020 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తాన్ని బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. ఇదిలాఉంటే, ఛార్లెస్ పట్టాభిషేకంతో పాటు క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. పట్టాభిషేకం సందర్భంగా రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించడంలేదు. ఎందుకంటే వలస రాజ్యాల పాలనకు గుర్తుగా ఈ వజ్రం నిలిచినందున..కోహినూర్ వజ్రం లేని కిరీటంతోనే రాజు ఛార్లెస్3, క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ చేయనున్నారు.
ఇక పట్టాభిషేకం సందర్భంగా ఛార్లెస్ 3 సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని ధరించనున్నారు. దీన్ని 444 నవరత్నాలు, మాణిక్యాలు పొదిగి పూర్తి బంగారంతో తయారు చేశారు. దీని బరువు 2.23 కిలోలు కాగా తొలిసారి 1661లో ఛార్లెస్ 2 ధరించారు. బ్రిటీష్ అధికారిక రాజ కిరీటంగా పేరొందిన ఈ ఎడ్వర్డ్ కిరీటాన్ని ఛార్లెస్ 2 తర్వాత నలుగురు మాత్రమే ధరించారు. చివరిసారిగా 1953లో ఎజిబిబెత్ 2 ఈ కిరీటాన్ని ధరించారు. మళ్లీ ఇప్పుడు ఆమె కుమారుడు ఛార్లెస్ 3కి ఆ అవకాశం దక్కుతోంది.