Monkeypox Cases: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు

Monkeypox Cases Rising: మంకీపాక్స్​మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టించడంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

Update: 2024-08-18 03:11 GMT

MonkeyPOx: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు

Monkeypox Cases: కరోనాతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. 1958లో గుర్తించిన ఈ వైరస్‌ కొత్తది కానప్పటికీ, మ్యుటేషన్‌తో కొత్త శక్తిని సంతరించుకోవడం భయపెడుతోంది.

పాకిస్తాన్‌లో మంకీపాక్స్​కలకలం రేపింది. స్వీడన్​తర్వాత ఈ దేశంలో ఈ వైరస్​కేసులు వెలుగుచూశాయి. దేశంలో ముగ్గురికి మంకీపాక్స్​వైరస్​సోకినట్టు పాకిస్తాన్​ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాకిస్తాన్​కు చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు ఈ నెల 3న యూఏఈ నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్‌‌‌‌ ఉన్నట్టు తేలింది. దేశంలో 3 మంకీ పాక్స్‌‌‌‌ కేసులు నమోదైనట్టు పెషావర్‌‌‌‌లోని ఖైబర్ మెడికల్ వర్సిటీ వెల్లడించింది. వారి సహప్రయాణికులతోపాటు సన్నిహితులను గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

మంకీపాక్స్​మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టించడంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గతేడాది కూడా పాకిస్తాన్​లో మంకీపాక్స్​కేసులు వెలుగు చూశాయి. అయితే, ఈ సారి వైరస్​బయటపడ్డ ముగ్గురికి ఏ వేరియంట్​ సోకిందో స్పష్టత లేదు. గతంలో నమోదైన మంకీపాక్స్‌ కేసులు పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌ వేరియంట్‌ రకానికి చెందినవని... తీవ్రత తక్కువ ఉండేదని... ఇప్పుడు నమోదవుతున్న కేసులు క్లాడ్‌-1 రకానికి చెందినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకితే మరణాల రేటు 10% వరకూ ఉండవచ్చని అంటున్నారు.

కాంగోలోని సౌత్ కీవూ ప్రావిన్స్ కేంద్రంగా ఎంపాక్స్‌ ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తోంది. త్వరలోనే గ్లోబల్ పాండెమిక్‌గా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని, మరణాలు కూడా పెరుగుతాయని డబ్ల్యూహెచ్‌వో డేంజర్‌ బెల్స్‌ మోగించింది. ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, యాంటీ వైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్‌ వంటి చర్యల ద్వారా వైరస్‌ను కట్టడి చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ప్రమాదకర ఎంపాక్స్ కేసును గుర్తించినట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎంపాక్స్ తీవ్రంగా వ్యాపించడం... అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన విషయమని చెబుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ... ఆరోగ్య అత్యవసరపరిస్థితి ప్రకటించిన కొన్ని గంటలకే ఆఫ్రికా వెలుపల ఈ కేసు గుర్తించారు. ఆఫ్రికాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఎంపాక్స్‌ స్వీడన్‌కు వ్యాపించింది. దీంతో స్వీడన్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

కరోనా విలయానికి ముందు 2020లో గ్లోబల్‌ జీడీపీ వృద్ధిరేటు 2.5% మేర పెరుగుతుందని ప్రపంచబ్యాంకు 2019లో అంచనా వేసింది. అయితే, కొవిడ్‌ కేసులు, లాక్‌డౌన్‌తో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం మేర పడిపోయింది. ఇప్పుడూ ఎంపాక్స్‌ కేసులతో అదే పరిస్థితి రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి సమయం పట్టినట్లే, మంకీపాక్స్‌ టీకాలకు సమయం పట్టొచ్చని గుర్తు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు ఉనికిని చాటుకుంటున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసుల విస్తృతిని నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. ఎంపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. భారత్‌లో ఎంపాక్స్ కొత్త కేసులేవీ రాలేదని పేర్కొంది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఎంపాక్స్ ప్రభావం భారత్‌లో పెద్దగా లేనప్పటికీ, భారీ ఎత్తున చర్యలు తీసుకోవాలని నడ్డా ఆదేశించారు. అన్ని ఎయిర్ పోర్టులు, హార్బర్లు, సరిహద్దుల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, ఎంపాక్స్ ను నిర్ధారించే ల్యాబొరేటరీలను సిద్ధం చేయడం, మంకీపాక్స్‌ను గుర్తించడం, ఐసోలేట్ చేయడం, చికిత్స వంటి అంశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News