Canada govt denies Indian govt role in criminal activities in Canada: కెనడాలో జరుగుతున్న నేరాలకు భారత్ ప్రమేయం ఉందని గతంలో జస్టిన్ ట్రూడో సర్కారు చేసిన ఆరోపణలు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఈ ఆరోపణలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగిపోయింది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా కెనడా మరో కీలక ప్రకటన చేసింది. కెనడాలో నేరాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌కు సంబంధం లేదని కెనడా ప్రకటించింది. వారికి కెనడాలో నేరాలతో సంబంధం ఉన్నట్లు వస్తోన్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని ఆ ప్రకటనలో పేర్కొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు నేషనల్ సెక్యురిటీ అండ్ ఇంటెలీజెన్స్ అడ్వైజర్ నెతాలి జి డ్రోయిన్ ఈ ప్రకటన విడుదల చేశారు.
కెనడాలో ఖలిస్థానీ ఉద్యమ నేత, భారత్ టెర్రరిస్టుగా చెబుతున్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం ఈ వివాదం మొదలైంది. నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్తల పాత్ర ఉందని అనుమానం వ్యక్తంచేస్తూ అక్టోబర్ 14న కెనడాలోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనను కూడా తాజాగా కెనడా ప్రస్తావించింది.
కెనడాలో పబ్లిక్ సేఫ్టీ ప్రమాదంలో ఉందనే ఆందోళనతోనే అక్టోబర్ 14న కెనడా పోలీసులు ఆ ప్రకటన చేశారు. కానీ కెనడా సర్కారు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంచేశారు. అలాగే కెనడాలో నేరాలకు భారత ప్రభుత్వాధినేతల హస్తం ఉందంటానికి ఆధారాలు ఉన్నాయనే విషయం కూడా తమకు తెలియదని కెనడా తేల్చిచెప్పింది. కెనడా చేసిన ఈ ప్రకటనతో జస్టిమన్ ట్రూడో సర్కారు యూటర్న్ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి అమిత్ షా ఆరోపణల సంగతేంటి?
భారత హోం శాఖ మంత్రి అమిత్ షా కెనడాలో సిక్కు వేర్పాటువాదులను టార్గెట్ చేస్తూ, వారికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారని కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరి కెనడా మంత్రి చేసిన ఆ ఆరోపణలపై తాజా ప్రకటనలో ఎందుకు ప్రస్తావించలేదనేదే ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న. పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ కెనడా సర్కారు వివరణ ఇచ్చింది. మరి ఏకంగా తమ ప్రభుత్వంలోని మంత్రి డేవిడ్ మోరిసన్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదో కూడా చెప్పాల్సి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.