Boris Johnson: బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌కు సొంత పార్టీ నుంచే జలక్.. అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కన్జర్వేటర్లు

*2023 ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే.. ప్రధాని పదవి నుంచి జాన్సన్‌ను తొలగించాలని పట్టు

Update: 2022-06-06 11:30 GMT

Boris Johnson: బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌కు సొంత పార్టీ నుంచే జలక్.. అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కన్జర్వేటర్లు

Boris Johnson: బ్రిటన్ ప్రధానమంత్రి బోరీస్‌ జాన్సన్‌కు సొంత పార్టీ నేతలే షాక్‌ ఇచ్చారు. ప్రధాని పీఠం నుంచి దించేందుకు సర్వం సిద్ధం చేశారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిర్వహించిన విందు ఘటన జాన్సన్‌ మెడకు చుట్టుకున్నది. జాన్సన్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని సొంత పార్టీ ఎంపీలు ప్రవేశపెడుతున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 180 మంది ఎంపీలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. సొంత పార్టీ ఇమేజ్‌ను కాపాడుకోవడానికే అవిశ్వాసమని ఎంపీలు చెబుతున్నారు. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా? లేక అవిశ్వాసంతో పదవిని జాన్సన్‌ ఊడగొట్టుకుంటారా? అనేది ఇప్పుడు భ్రిటన్‌లో చర్చనీయాంశంగా మారింది.

బ్రిటన్‌లో కోవిడ్‌ మహమ్మారి కల్లోలం సృష్టించింది. అప్పట్లో దేశమంతటా లాక్‌డౌన్‌ విధించారు. 2020 జూన్‌ 19న 10 డౌన్‌స్ట్రీట్‌లోని అధికారిక నివాసంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పుట్టిన రోజు సందర్భంగా సహచరులకు మద్యంతో విందు ఏర్పాటు చేశారు. ప్రజలంతా కరోనాతో విలవిలలాడుతుంటే.. నిబంధనలను ఉల్లంఘిస్తూ మందు పార్టీ చేసుకోవడం ఏమిటంటూ బ్రిటన్‌లో అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏప్రిల్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు కూడా చెప్పారు. అయినా బోరిస్‌ దిగిపోవాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీనేకాకుండా సొంత కన్జర్వేటివ్‌ పార్టీలోనూ బోరిస్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండ్రోజుల క్రితం బ్రిటన్‌ రాణి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లోనూ ప్రధానికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. అక్కడున్న వారిలో పలువురు పరుష పదజాలంతో హేళన చేశారు. మరికొందరు వెకిలిగా మాట్లాడారు.

బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం సొంత పార్టీ కన్జర్వేటివ్‌ నేతలే ప్రవేశపెడుతున్నారు. బోరిస్‌ జాన్సన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నేతలు చెబుతున్నారు. 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ప్రధాని పదవి నుంచి జాన్సన్‌ను తొలగించాల్సిందేనని కొందరు కన్జర్వేటర్లు పట్టుబడుతున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కనీసం 54 మంది ఎంపీలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అందుకు కారణాలను కూడా వివరిస్తూ లెటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ లేఖలు రహస్యంగా ఉంచుతారు. బోరిస్‌పై 25 మంది కన్జర్వేటివ్‌ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరుగు ఎంపీలు జాన్సన్‌ తీరును వ్యతిరేకిస్తున్నారు. బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాసం నెగ్గాలంటే 180 మంది ఎంపీలు ఓటేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అవిశ్వాసం ప్రతిపాదనకు ఎంత మంది మద్దతు ఇచ్చారో కూడా తెలియదంటున్నారు.

అయితే గతంలోనూ పార్టీగేట్‌ కుంభకోణం విషయంలో ప్రధానమంత్రి పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. అయితే రాజీనామాకు చేసేందుకు జాన్సన్‌ నిరాకరించారు. తనపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమైనా జాన్సన్‌ పట్టించుకోలేదు. సాధారణంగా అడిగితే జాన్సన్‌ ఒప్పుకోరని అవిశ్వాస తీర్మానమే సరైన మార్గమని కన్జర్వేటివ్‌ ఎంపీలు నిర్ణియించుకున్నారు. ప్రధానిపై అవిశ్వాసానికి 13 కారణాలతో ఓ మెమోను రూపొందించారు. బోరీస్‌ను వ్యతిరేకించేవారంతా ఏమవుతున్నారు. పదవి నుంచి దింపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందుకు ప్రతిపక్షాల మద్దతు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అదేమంత సులువు కాదని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే మాత్రం బోరిస్‌ జాన్సన్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే కన్జర్వేటివ్‌ పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని పదవి కోసం పోటీ భారీగా ఉందని చెబుతున్నారు. అయితే ప్రధాని మాత్రం తన వారసుడిగా, భారత సంతతికి చెందిన రిషీ సునక్‌ను ఎంచుకునే అవకాశం ఉందని గతంలో కథనాలు వచ్చాయి. అయితే రిషీ సునక్‌ కూడా పార్టీగేట్‌ విందులో పాల్గొన్నారు. పైగా సునక్‌ భార్య, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిపైనా టాక్స్‌ వివాదం నడుస్తోంది. అయితే అవేమీ పెద్ద సమస్యలు కావని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. రిషీ సునక్‌ ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక శాఖమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని పదవి రేసులో విదేశాంగ సెక్రటరీ లిజ్‌ ట్రస్‌, కేబినెట్‌ మంత్రులు మైకెల్‌ గోవ్‌, ఒలివర్‌ డోడెన్‌ ఉన్నారు. వారితో పాటు విదేశాంగ మాజీ సెక్రటరీ జరేమీ హంట్‌, భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌, హెల్త్‌ సెక్రటరీ సజిద్‌ జావిద్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఏదేమైనా పార్టీగేట్‌ కుంభకోణం కష్టాలు మాత్రం బోరిస్‌ జాన్సన్‌ను ఇప్పుడిప్పుడే వీడేలాలేవు. 2019లో ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తరువాత కొన్ని నెలలకే కరోనా విజృంభించింది. ఆ తరువాత బ్రిటన్‌ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.  

Tags:    

Similar News