Boris Johnson: కీవ్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ ప్రత్యక్షం
Boris Johnson: కీవ్‌లో జెలెన్‌స్కీతో కలిసి బోరిస్ పర్యటన
Boris Johnson: రష్యా వ్యూహం మార్చుకుని తూర్పు ఉక్రెయిన్‌పై దాడులు పెంచింది. మరోవైపు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వచ్చారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి వీధుల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా బోరిస్ తెలుసుకున్నారు. స్థానికులతో బ్రిటన్ ప్రధాని మాట్లాడారు. రష్యాతో యుద్ధంతో నష్టపోయిన ఉక్రెయిన్‌ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా, ఆయుధ పరంగా కొత్త ప్యాకేజీలను బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలోని బుచా నగరంలో రష్యా సైనికుల ఊచకోతకు పాల్పడింది. ఈ ఘనటపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటన జరిగిన తరువాత తొలిసారి ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించారు. రాజధాని కీవ్ నగరంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి బోరిస్ పర్యటించారు. అక్కడి ప్రజలతో స్వయంగా యుద్ధం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రష్యా సేనలను దీటుగా ఎదుర్కొన్న ఉక్రెయిన్ పోరాట పఠిమను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ కొన్ని గంటల్లో తమ వశం అవుతుందని భావించిన రష్యన్లకు చావు దెబ్బ ఎలా ఉంటుందో తెలిసిందన్నారు. ఉక్రెయిన్ ప్రజలు సింహం లాంటి తెగువను ప్రదర్శించినట్టు కొనియాడారు. ప్రపంచం కొత్త హీరోలను కనుక్కున్నదని.. ఆ హీరోలు ఉక్రెయిన్ ప్రజలని జాన్సన్ స్పష్టం చేశారు.
క్వీవ్‌లోని ఉక్రెయిన్ అధ్యక్ష భవనంలో జెలెన్‌స్కీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సమావేశమయ్యారు. తమ వంతు ఉక్రెయిన్‌కు మద్ధతు ఇస్తామన్నారు. తాజాగా ఆర్థిక, ఆయుధపరంగా కొత్త ప్యాకేజీలను ప్రకటించారు. అన్యాయంగా ఆక్రమణకు దిగిన రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్‌కు 120 యుద్ధ వాహనాలు, యాంటీ ట్యాంకు క్షిపణులు 800 ఇస్తామని బోరిస్ స్పష్టం చేశారు. అంతకుముందు 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రపంచ బ్యాంకు ద్వారా అందిస్తామని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బుచా, ఇర్పిన్ నగరాల్లో నరమేధం సృష్టించారని బోరిస్ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ రాక్షస నిర్ణయాలను విరోచిత పోరాటాలతో జెలెన్‌స్కీ అడ్డుకున్నారని కొనియాడారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. బ్రిటన్ తరహాలో పాశ్యాత్య దేశాలు మిలిటరీ సాయం అందించాలన్నారు.
మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా మానిక దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో మందుగుండు స్థావరం సహా ఉక్రెయిన్‌కు చెందిన మిగ్-29 యుద్ధ విమానం, ఎంఐ-8 హెలికాప్టర్‌లు ధ్వంసమయ్యాయి. ఖార్కివ్ నగరం పైనా ఫిరంగులు, మోర్టార్‌లు, రాకెట్ లాంచర్లతో 50కి పైగా దాడులు చేసినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. కీవ్ ప్రాంతంలోని మకరీవ్ పట్టణంలో 132 మృతదేహాలు బయటపడినట్టు తెలిపింది. ప్రజలను క్రూరంఘా హింసించి హత్య చేసినట్టు తెలుస్తోందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. లుహాన్స్క్ రీజియన్‌పై దాడులు పెరగడంతో...సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి గవర్నర్ ప్రజలకు సూచించారు. 10 మానవతా కారిడార్లు ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్ ఉప ప్రధాని తెలిపారు.
ఇప్పటివరకు 19వేల 100మంది పుతిన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధంలో రష్యాకు చెందిన 705 యుద్ధ ట్యాంకులు, 18 వందల 95 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు వివరించింది. 151 యుద్ధ విమానాలు, 136 హెలికాప్టర్లు, 112యూఏవీలను కూల్చినట్లు ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి.